గుంటూరు, ఫిబ్రవరి 12:వైసీపీలో సీఎం జగన్ ది ఒంటెద్దు పోకడ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం జగన్ రెడ్డికి నమ్మి ఓట్లు వేసి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ‘వైసీపీలో పవర్ కొద్ది మంది చేతుల్లో మాత్రమే ఉంది. ఆ పార్టీలో బీసీలు అవమానాలకు గురవుతున్నారు. బీసీలది ఆత్మగౌరవ పోరాటం. పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడ చాలా బాగా కనిపిస్తోంది. ప్రభుత్వం బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన సామాజిక న్యాయం చేయలేదు. బీసీలకు తాత్కాలిక పదవులిచ్చారు కానీ వాటికి పవర్ లేదు. అధికారమంతా కొద్ది మంది దగ్గరే పెట్టుకున్నారు. వైసీపీలో బీసీలు అవమానాలకు గురవుతున్నారు. పార్టీలో బీసీలకు సరైన గౌరవం, స్వేచ్ఛ, కేటాయించిన అధికారం లేక ఎంతో మంది బీసీలు వైసీపీకి దూరం అవుతున్నారు. ఈ విషయంలో వైసీపీ పునరాలోచించుకోవాలి. వైసీపీ స్థాపించిన నాటి నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం పటిష్ఠం కోస పని చేశాను. ఆయన్ను సీఎం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఆయన విజయంలో నేను కూడా భాగస్వాముడిని అయ్యాను. కానీ ఈ రోజు రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉంది.’ అని జంగా తీవ్ర విమర్శలు చేశారు.