విజయవాడ, ఫిబ్రవరి 12:చంద్రబాబు వయసు 7 పదులు దాటింది. ఎన్నికలు అటు ఆయనకు, ఇటు టిడిపికి జీవన్మరణ సమస్య. అందుకే ఈ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు తెగ ప్రయత్నం చేస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నారు. బిజెపితో కూడా పొత్తు పెట్టుకుంటామనే సంకేతాలు పంపించారు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. సీట్ల కేటాయింపుకు సంబంధించిన ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కి రాకపోయినప్పటికీ.. చంద్రబాబు చెప్పినట్టే సీట్ల సర్దుబాటు జరుగుతుందని టిడిపి అనుకూల విూడియా చెబుతోంది. అంతేకాదు జనసేన కూడా చంద్రబాబు చెప్పినట్టే వింటున్నదని వార్తలు రాస్తున్నది. ఇంతవరకు వీటికి సంబంధించి ఎటువంటి అడుగులు పడకపోయినప్పటికీ.. టిడిపి అనుకూల విూడియా మాత్రం ఊహాగానమైన వార్తలను రాస్తూనే ఉంది. ఇదిలా ఉండగానే విూడియా సర్కిల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.ఈసారి జరిగే ఎన్నికల్లో టిడిపి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో అటు బిజెపి, ఇటు జనసేనతో కలిసి ప్రయాణం సాగించాల్సి ఉండటంతో కచ్చితంగా సీట్ల విషయంలో కోతపడే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు నాయకులకు సంకేతాలు పంపిస్తున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్ తమ్ముళ్ళకు చంద్రబాబు నాయుడు పెద్ద షాక్ ఇచ్చారు. టికెట్ల కేటాయింపునకు సంబంధించి సూపర్ సీనియర్ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇస్తున్నామని తేల్చి చెప్పారు. చింతకాయల, జెసి, పరిటాల, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలు ఎప్పటినుంచో టిడిపిలో ఉన్నాయి. ఈ కుటుంబాలకు గతంలో రెండేసి టికెట్లు దక్కేవి. అయితే ఈసారి పొత్తు రాజకీయాల వల్ల ఈ కుటుంబాలకు ఒక టికెట్ మాత్రమే ఇస్తామని చంద్రబాబు చెప్పారు. దీంతో ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. జనసేనతో పొత్తువల్లే టిడిపి పోటీ చేయబోయే సీట్ల సంఖ్య తగ్గుతోందని తెలుస్తోంది. కమలం పార్టీతో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అది కూడా పొత్తులో భాగస్వామి అయితే టిడిపి పోటీ చేసే సీట్లల్లో మరింత కోతపడుతుంది.పోటీ చేయబోయే సీట్ల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో సీనియర్ సిటిజన్ కుటుంబాలకు చంద్రబాబు నాయుడు రెండేసి టికెట్లు ఇవ్వబోమని చెప్పారు. ఇస్తే వారిలో ఆగ్రహం ఉంటుందని తెలిసి.. వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడికి నర్సీపట్నం అసెంబ్లీ, ఆయన కొడుకు చింతకాయల విజయ్ కి అనకాపల్లి ఎంపీ టికెట్ అడుగుతున్నారు. పరిటాల సునీత రాప్తాడు లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన కొడుకు పరిటాల శ్రీరామ్ కు ధర్మవరం టికెట్ అడుగుతున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనకు కర్నూల్ ఎంపీ, మన భార్య సుజాతమ్మకు ఆలూరు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. గత ఎన్నికల్లో వీరిద్దరూ ఆ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. కేఈ ప్రతాప్ లేదా కేఈ ప్రభాకర్ డోన్ అసెంబ్లీ టికెట్ తో పాటు కేజీ కృష్ణమూర్తి కొడుకు కేఈ శ్యాం బాబు పత్తికొండ సీటు ఆశిస్తున్నారు. పూసపాటి అశోక గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. ఆయన కూతురు అదితికి విజయనగరం ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఇక జెసి కుటుంబంలో పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అనంతపురం ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్లు కావాలని కోరుతున్నారు. అయితే వీరు రెండేసి టికెట్లు అడిగితే.. గత్యంతరం లేని పరిస్థితిలో సీట్లు కేటాయిస్తే.. మిగతావారి నుంచి కూడా ఒత్తిడి అధికమవుతుందని చంద్రబాబు ముందే గ్రహించారు. అందుకే శనివారం జరిగిన సమావేశంలో కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమే అని కచ్చితంగా చెప్పారని ప్రచారం జరుగుతుంది. మరి మిగతా నాయకులను ఏం చేస్తారు? ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే ఏవైనా పదవులు ఇస్తారా? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి