ఎన్డీఏలో చేరేందుకు జగన్‌ ప్రతిపాదన
అందుకే ఏపీ పొత్తులపై బీజేపీ తేల్చుకోలేకపోతోందా ?
విజయవాడ, ఫిబ్రవరి 12: సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో జమలీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దేశంలో అన్ని చోట్లా బీజేపీ ప్రిపరేషన్స్‌ దాదాపుగా పూర్తి చేసింది. కానీ ఏపీ విషయానికి వచ్చే సరికి ఆ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. పొత్తులతో వెళ్లాలా.. వెళ్తే ఏ పార్టీతో వెళ్లాలి..లేకపోతే ఒంటరిగా వెళ్లాలా అన్నదానిపై ఇప్పటి వరకూఓ అభిప్రాయానికి రాలేదు. ఏపీలో కూటమిపై త్వరలో ఓ స్పష్టతకు వస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఓ టీవీ చానల్‌ కార్యక్రమంలో చెప్పారు. అయితే ఆయన టీడీపీ ఎన్డీఏలోకి వస్తుందని కానీ.. .మరో హింట్‌ కానీ ఇవ్వలేదు. పొత్తులపై స్పష్టత ఇస్తామన్నారు. ఇక్కడే అసలు బీజేపీ ఏ పార్టీతో జత కట్టబోతోందన్న అంశంపై ఆసక్తికర చర్చ ప్రారంభమయింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజుల కిందట అమిత్‌ షా, జేపీ నడ్డాలతో ఢల్లీిలో సమావేశం అయ్యారు. ఈ భేటీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక అంశంపై మాత్రమేనని ప్రత్యేకంగా చెప్పాల్సినపని లేదు. కానీ రెండు పార్టీల మధ్య లెక్క తేలని అంతరాలేవో ఉన్నాయి. వాటి మధ్య పీట ముడి పడిరది. వాటిపై స్పష్టత రావడం లేదు. అందుకే అధికారిక ప్రకటన ఆలస్యమవుతోందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. అది సీట్ల సర్దుబాటు మాత్రమే కాదని అంతకు మించిన విషయం ఉండి ఉంటుందని ఆలోచించే రాజకీయ విశ్లేషకులు కూడా ఉంటారు. బీజేపీ విషయంలో టీడీపీకి ఉన్న అభ్యంతరం.. వైసీపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం. అవినీతి కేసుల్లోనే కాదు చివరికి హత్య కేసుల్లోనూ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆయన సన్నిహితుల్ని కాపాడుతున్నారని టీడీపీ నేతల ఆరోపణ. అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి వేల కోట్లు అప్పులు ఇస్తున్నారు. ఇరవై సార్లు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించి అప్పులు తెచ్చినాకేంద్రం పట్టించుకోవడం లేదని మళ్లీ మళ్లీ ఆర్బీఐ దగ్గర నుంచి ఇప్పిస్తూనే ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ డబ్బులతోనే ఆయన బటన్‌ నొక్కి ఎన్నికల సమయంమలో ఓటర్ల ఖాతాల్లో డబ్బులు వేయాలనుకుంటున్నారు. అదే సమయంలో ఎన్నికల నిర్వహణలో నిష్ఫాక్షికత ఉండటం. ఈసీ కఠినంగా నిబంధనలు అమలు చేసి.. వైసీపీ నేతల అరాచకాల్ని అరికట్టాలని టీడీపీ కోరుకోవడం సహజమే. ఇలాంటి అభ్యంతరాలన్నింటికీ బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది మాత్రం స్పష్టత లేదు. అయితే టీడీపీ ఊహించినట్లుగా స్పందన లేకపోవడం వల్లే ఆలస్యమవుతోందన్న వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్‌ ఎన్డీఏలో చేరుతారన్న అంశంపై కొంత కాలంగా ఢల్లీి వర్గాల్లో విస్తృతంగా ప్రచారం లో ఉంది. అయితే రాజకీయ సిద్ధాంతాలు, ఓటు బ్యాంకుల పరంగా చూస్తే.. బీజేపీ, జగన్‌ పొత్తులు అనేవి సరిపడవు. అదే చేస్తే రాజకీయంగా జగన్మోహన్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధాన ఓటు బ్యాంక్‌ ముస్లింలు, దళితులు. వీరిలో బీజేపీపై వ్యతేరికత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బీజేపీతో జగన్మోహన్‌ రెడ్డి కలిస్తే వారిలో ఓ పది శాతం కాంగ్రెస్‌ వైపు మళ్లినా జగన్‌ కు జరిగే నష్టాన్ని అంచనా వేయడం కష్టం. కానీ రాజకీయాల సవిూకరణాలు కేవలం ఈ ఓటు బ్యాంక్‌ రాజకీయాల విూదనే ఆధారపడి ఉండవు. అంతకు మించిన ఎక్స్‌ ట్రా అంశాలు కూడా ఉంటాయి అందుకే జగన్మోహన్‌ రెడ్డి ఎన్డీలో చేరేందుకు తన ఆసక్తిని బీజేపీ హైకమాండ్‌ ముందు పెట్టారని చెబుతున్నారు. టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్తే ఆ తర్వాత తాను ఎదుర్కొబోయే రాజకీయ పరిణామాలను ఊహించడం కష్టమని.. అలాంటి కష్టం రాకుండా ఉండాలంటే.. ఖచ్చితంగా మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వస్తున్న బీజేపీ అండ ఉండాలని జగన్‌ గట్టిగా భావిస్తున్నారు. అందుకే.. రాజకీయంగా ఏపీలో తనకు నష్టం జరిగినా సరే.. బీజేపీ అండ ఉండేందుకు ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమయ్యారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి ముందు ప్రతిపాదించారని.. ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు. అమిత్‌ షా ఓ టీవీ చానల్‌ చర్చలో ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని ప్రకటించారు. కూటమి నుంచి వెళ్లిపో?యన అకాలీదళ్‌ ఇప్పటికే తాము ఎన్డీఏలో చేరుతామని ప్రకటించింది. చరణ్‌కు భారత రత్న ప్రకటించిన తర్వాత ఆ పార్టీకి అభ్యంతరాలు లేవు. ఇక ఏపీ నుంచి కూటమిలోకి ఓ పార్టీ వస్తుందని అమిత్‌ షా హింట్‌ ఇచ్చారు. అది ఏ పార్టీ అన్నది ఆయన చెప్పలేదు. కొత్త పార్టీ వస్తుందని మాత్రం చెప్పారు. కొత్త పార్టీ అంటే.. టీడీపీనా.. వైసీపీనా అన్నదానిపై స్పష్టత లేదు. టీడీపీ ఎన్డీఏకు పాత పార్టీనే. ఎన్డీఏ చేరే కొత్త పార్టీ వైసీపీనే అవుతుంది. కానీ అమిత్‌ షా ఏ ఉద్దేశంతో అలాంటి ప్రకటన చేశారో తెలియదు. ఏపీలో బీజేపీ నేతలు మాత్రం ఇప్పటికే తమ అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా కేంద్ర నాయకత్వానికి ఇచ్చారు. ఇందులో వైసీపీతో పొత్తుతో వెళ్లాలని చెప్పిన వారు కూడా ఉన్నారని అంటున్నారు. బీజేపీతో శత్రుత్వం తెచ్చుకునే పరిస్థితి లేకుండా రాజకీయంగా నష్టం లేకుండా ఎన్డీఏ కూటమిలో చేరేందుకు జగన్‌ సిద్ధమయి ఉంటే.. బీజేపీ చేర్చుకుంటుందా లేదా అన్నది కీలక అంశం. చేర్చుకునేందుకు సిద్ధమైతే ఏపీలో రాజకీయాలు భిన్నంగా మారతాయి. అప్పుడు బీజేపీ, వైసీపీ వర్సెస్‌ టీడీపీ, జనేసన అన్నట్లుగా మారుతాయి. అందుకే.. ఏపీ రాజకీయాలను ఊహించడం కష్టంగా మారింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *