కడప , ఫిబ్రవరి 12: ఎన్నికల నగరా మోగలేదు.. కానీ అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం మాత్రం రసకందాయంలో పడిరది. ఇప్పటి వరకు అధికార జగన్ పార్టీ వర్సెస్ టీడీపీ, జనసేన అన్నట్లుగా పరిస్థితులు ఉంటే.. ఏపీసీసీ చీఫ్‌గా వైయస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అధికార వైసీపీ వర్సెస్ వైఎస్ షర్మిల అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిల.. సోదరుడు జగన్ పాలనపై మరోసారి నిప్పులు చెరిగారు. మరోవైపు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ . తూర్పు గోదావరి జిల్లా గోకవరం సవిూపంలో ఓ సభలో మాట్లాడుతూ, జగన్ పాలనపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు, అలాగే జగన్ సొంత మేనత్త విమలారెడ్డి కూడా అదే రోజు గుంటూరు వేదికగా పత్తిపాడు నియోజకవర్గంలోని పాస్టర్లతో సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో మళ్లీ జగన్ పాలన రావడం కోసం.. చేయాల్సిన అంశాలపై కులంకూషంగా చర్చించారన్న ప్రచారం అయితే రాజకీయవర్గాలలో వాడి వేడిగా నడుస్తోంది. అయితే గత ఎన్నికల వేళ.. ఒక్కరి గెలుపు కోసం అందరూ కలిసి పని చేశారనీ, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, జగన్‌ని అధికార పీఠం ఎక్కించడం కోసం వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు, అలాగే ఆమె భర్త బ్రదర్ అనిల్.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లతో సభలు, సమావేశాలు నిర్వహించారు, జగన్ ముఖ్యమంత్రి అయితే పరిస్థితులు మారతాయంటూ ఓ విధమైన భరోసా సైతం కల్పించారు.అలాగే జగన్ మేనత్త వైఎస్ విమలారెడ్డి సైతం దాదాపుగా అదే బాటలో నడిచారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత .పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. దీంతో వైఎస్ షర్మిల ఎటువైపు అడుగులు వేశారో అందరికీ తెలిసిందేనని అంటున్నారు. ఇక ఆమె భర్త బ్రదర్ అనిల్ అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల నాయకులతో భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండడంతోపాటు, జగన్ పాలననే టార్గెట్‌గా చేసుకోని దూసుకుపోతుండడంతో, జగన్ తన మేనత్త విమలారెడ్డిని రంగంలో దింపారని.. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన రాజకీయం ఒకలాగా ఉంటే.. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం అందుకు పూర్తి భిన్నంగా ఉందనే ఓ చర్చ అయితే సదరు సర్కిల్‌లో వైరల్ అవుతోంది.