ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలి
సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ నేత జగదీష్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు
తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్‌ రెడ్డికి ధర్మాసనం నోటీసులు
హైదరాబాద్‌ ఫిబ్రవరి 9:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైదరాబాద్‌ నుంచి కేసు విచారణ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మార్చాలని ట్రాన్స్ఫర్‌ పిటిషన్‌ను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత జగదీష్‌ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను భోపాల్‌కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్‌ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.
సీఎం, హోం మంత్రిగా ఒకరే బాధ్యతలు నిర్వహిస్తున్నారని వెంటనే ట్రయల్‌ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ట్రయల్‌ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషనర్‌ జగదీష్‌ రెడ్డి తరపు న్యాయవాది మోహిత్‌ రావు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఒకవేళ ట్రయల్‌పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ట్రయల్‌ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పిటీషనర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం రేవంత్‌ రెడ్డిపై 88 క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
స్పందన ఎలా ఉంటుందో..?
కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన 100 రోజుల్లో గత ప్రభుత్వం చెప్పినట్లు విన్న పోలీసు అధికారులందరిని నగ్నంగా పరేడ్‌ చేస్తా అని గతంలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను కూడా ధర్మాసనంకు పిటిషనర్‌ అందజేశారు. పిటిషనర్‌ వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా సీఎం రేవంత్‌ రెడ్డి, ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు నాలుగు వారాల్లో స్పందించాలని అందులో పేర్కొంది. అయితే.. రేవంత్‌, తెలంగాణ ప్రభుత్వం ఈ నోటీసులను ఎలా తీసుకుంటుంది..? స్పందన తర్వాత ఏం జరగబోతోంది..? అనే దానిపై కాంగ్రెస్‌ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *