ఆంధ్రప్రదేశ్ విభజన హావిూల అమలు 5.5 కోట్ల ప్రజల హక్కు
అసెంబ్లీలో ‘ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు’ తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలి
కేంద్రంపై కలిసిపోరాడాలని సిఎం జగన్ ,ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల బహిరంగ లేఖలు
అమరావతి, ఫిబ్రవరి 07: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల చాలా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా తన అన్న, ముఖ్యమంత్రి జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ నిర్ణయాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ తీరును తూర్పారబడుతూ బహిరంగ లేఖ రాశారు వైఎస్ షర్మిల. రాష్ట్ర హక్కుల సాధన విషయంలో ప్రభుత్వ అనుసరిస్తున్న తీరును ఆమె విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్రంపై ఉమ్మడి పోరాటానికి సిద్ధమవ్వాలని ఇటు సీఎం జగన్, అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు షర్మిల.
వైఎస్ షర్మిల రాసిన లేఖలోని సారాంశం:
‘ఆంధ్రప్రదేశ్ విభజన హావిూల అమలు 5.5 కోట్ల ప్రజల హక్కు. వాటిని విస్మరించి, నిర్లక్ష్యం చేసి, రాష్ట్రాన్ని ఇంకా మోసం చేస్తూనే ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇందులో భాగంగా, విభజన హావిూలు గుర్తు చేస్తూ కేంద్రంపై కలిసిపోరాడాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖలు రాయడం జరిగింది. హావిూలపై అసెంబ్లీలో ‘ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు’ తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని ఈ లేఖల్లో మా డిమాండ్ ముందుంచాము. అలాగే యావత్ అసెంబ్లీ సభ్యులకు ఇదే నా మనవి. కలసి పోరాడదాం, విూ విూ పార్టీల తరుపున అసెంబ్లీ వేదికగా ఈ చర్చ కొనసాగించండి, అసెంబ్లీ తీర్మానానికి పట్టుబట్టండి. ఇది రాజకీయాలకతీతంగా అందరం చేయాల్సిన పోరు.’ అని లేఖలో పేర్కొన్నారు వైఎస్ షర్మిల.
‘ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం గడిచిన పదేళ్లలో అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మొదటి ఐదేళ్లు టీడీపీ, ఇప్పుడు వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నా పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హావిూలు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం, అత్యంత బాధాకరం. నాడు తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగకుండా అభివృద్ధి, పునర్నిర్మాణం అత్యంత వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో ప్రత్యేక హోదా సహా పోలవరానికి జాతీయ హోదా వంటి ముఖ్యమైన హావిూలు పొందుపరచటం జరిగింది. కానీ విభజన అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఆ హావిూలను పూర్తిగా పక్కన పెట్టేసింది. నాడు బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ పార్టీ, ఐదున్నర కోట్ల ప్రజల ఆశలను, ఆశయాలను తీర్చే హావిూలను సాధించుకోవడానికి పోరాటం చేయలేదు. ఏపీ ప్రజలకు ఆనాడు విూరు చేసిన అన్యాయానికి మేము చింతిస్తున్నాం. రాష్ట్రానికి జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరి చేస్తామనే వాగ్దానంతో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ, పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.’ అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు షర్మిల.
అమలు కాని విభజన హావిూలు:ం
తన లేఖలో అమలు కాని విభజన హావిూలు అని కొన్ని అంశాలను ప్రస్తావించారు వైఎస్ షర్మిల. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా, విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ`చెన్నై పారిశ్రామిక కారిడార్, కొత్త రాజధాని నగర నిర్మాణం. ఇవి కాకుండా భవిష్యత్తు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు.