ముగిసిన శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు
` తీర్మానాలను విూడియాకు వెల్లడిరచిన టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి
తిరుమల: తిరుమల ఆస్థానమండపంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు సోమవారం ముగిసింది. ఈ సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలతో చేసిన తీర్మానాలను చివరి రోజు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి విూడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ 1933వ సంవత్సరంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య వైభవాన్ని, సనాతనధర్మాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేయటానికి తిరుమల తిరుపతి దేవస్థానముల ఆవిర్భావం జరిగిందన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, నాలాయిర దివ్యప్రబంధ పారాయణ ప్రాజెక్టు, శ్రీనివాస కల్యాణోత్సవ మరియు శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టుల ద్వారా ధార్మిక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా తీసుకెళుతున్నామని చెప్పారు. దశాబ్దాల క్రితమే శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల ద్వారా గోసంరక్షణకు టీటీడీ శ్రీకారం చుట్టిందన్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాపింపచేయడానికి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏర్పాటుచేసి ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి వైభవాన్ని చాటుతున్నట్టు వివరించారు.పురాణేతిహాస ప్రాజెక్టు ద్వారా అనేక పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాల ముద్రణ, శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు భక్తి సంకీర్తనలకు ప్రాచుర్యం కల్పిస్తున్నట్టు ఛైర్మన్ తెలిపారు. గతంలో తాను ఛైర్మన్‌గా ఉన్నపుడు 2007, 2008లో రెండు సార్లు ధార్మిక సదస్సులు నిర్వహించామన్నారు. ఆ సదస్సుల్లో స్వావిూజీలు చేసిన సూచనల ఆధారంగానే దళితగోవిందం, మత్స్య గోవిందం, అర్చకులకు శిక్షణ, కల్యాణమస్తు వంటి అనేకానేక ధార్మిక కార్యకలాపాలకు శ్రీకారం చుట్టామని తెలియజేశారు. శ్రీవారి అనుగ్రహంతో దాదాపు 17 ఏళ్ల తరువాత మళ్లీ ధర్మప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం తనకు దక్కిందన్నారు. హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు మూడు రోజులుగా జరుగుతున్న ధార్మిక సదస్సులో ఎందరో మహానుభావులైన పీఠాధిపతులు, మఠాధిపతులు తమ అమూల్యమైన సూచనలను అందించారని చెప్పారు.
శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు తీర్మానాలు
1. హిందూమతంలో చేరాలనుకునేవారికి పవిత్రజల సంప్రోక్షణ ప్రక్రియఈ సదస్సుకు వచ్చిన పలువురు స్వావిూజీల ఏకకంఠ అభిప్రాయాన్ని అనుసరించి ఇతర మతస్తులు ఎవరైనా స్వచ్ఛందంగా హిందూ మతంలోకి మారడానికి శ్రద్ధతో ఇష్టపడి వచ్చేవారి కోసం తిరుమలలో ఒక ప్రాంగణం ఏర్పాటుచేసి పవిత్రజల ప్రోక్షణంతో విధిపూర్వకంగా ప్రక్రియను నిర్వహించి స్వాగతించాలని, ఒకసారి శ్రీవారి దర్శనం కల్పించాలని సదస్సు తీర్మానించింది.
2. పురాణ ప్రచారంసమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు హైందవధర్మాన్ని సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేవి పురాణాలు. కనుక పురాణముల విస్తృత ప్రచారం చేయుటకు అదేవిధంగా సామర్థ్యం కలిగిన పురాణ ప్రవచనకర్తలకు శిక్షణనిచ్చుట అవసరం అని సదస్సు తీర్మానించింది.
3. తిరుపతిలో పవిత్ర వాతావరణంతిరుమల చేరుకోవాలంటే యాత్రికులందరూ తప్పనిసరిగా తిరుపతికి రావలసిందే. కనుక యాత్రికులకు తిరుమలలో లాగే తిరుపతిలో కూడా సంపూర్ణమైన ఆధ్యాత్మిక వాతావరణం, భక్తిభావన కలగాలి. అందుకు తగినట్లుగా తిరుపతిని మార్చాలని సదస్సు తీర్మానించింది.
4. సమైక్యతా భావం పెంపొందించడం, మతాంతీకరణ నివారణోపాయాలు
నానాటికీ హిందూ సమాజం బలహీనం కావడానికి కారణం కొన్ని వర్ణ, వర్గాల పట్ల కొందరికి ఉన్న వివక్షతో కూడిన దృష్టి ప్రధానాంశం. అందువలన ఆయా జాతులవారు హిందూసమాజానికి దూరం అవుతున్నారు. వారినందరినీ కలుపుకుని సనాతన ధర్మం అందరిదీ అని చెప్పడానికి అన్ని విధాలుగానూ ప్రయత్నించాలి. వారి మతాంతీకరణను నివారించుటకు తగిన ఉపాయాలను సిద్ధపరచుకోవాలని సదస్సు తీర్మానించింది.
5. దేవాలయాల పరిరక్షణ, నిర్మాణం
భారతీయ సమాజంలో అందరికీ చక్కని సంస్కారాలను నేర్పేవి దేవాలయాలు. అటువంటి దేవాలయాలు వేలాదిగా శిథిలమవుతున్నాయి, కొన్ని ప్రాంతాలలో పూర్తిగా కనుమరుగవుతున్నాయి. కనుక అందరికీ సంస్కారాలందించడానికి శిథిలములైన దేవాలయాలను ఉద్ధరించుట, దేవాలయాలు లేని చోట మరియు హరిజన, గిరిజన, మత్స్యకార ప్రాంతాలలో దేవాలయాలు నిర్మించుట ఎంతగానో అవసరమని సదస్సు తీర్మానించింది. టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా హరిజన, గిరిజన, మత్స్యకార ప్రాంతాలలో 3600 ఆలయాల నిర్మాణం చేపట్టింది.
6. గో సంరక్షణ
హిందూ సమాజం గోవిందుని పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నదో గోవు పట్ల కూడా అంతే భక్తి కలిగి ఉన్నది. హిందువులకు గోవు తల్లితో సమానం. కానీ నేటి సమాజంలో ఆధునిక అలవాట్ల ప్రభావం వల్ల గోమాతలు క్షీణించిపోతున్నాయి. కనుక గో సంరక్షణ అత్యావశ్యకతగా సదస్సు తీర్మానించింది.
7. వేద, శాస్త్ర, విద్యావ్యాప్తి సంరక్షణహిందూ ధర్మానికి మూలం వేదములు, శాస్త్రములు. ఏ యజ్ఞములు చేయాలన్నా, ఏ సత్కర్మలు ఆచరించాలన్నా వేదశాస్త్రాలు ఎంతో అవసరం. కనుక వేదశాస్త్రాల పరిరక్షణ ఎంతో అవసరమని సదస్సు తీర్మానించింది.
8. సార్వజనీనంగా ధర్మ, ఆచార, సంప్రదాయ ప్రచారం, పరిరక్షణ
హిందూ ధర్మముల పట్ల, ఆచారముల పట్ల, సంప్రదాయముల పట్ల అందరికీ ఆసక్తి, ఆదరణ, శ్రద్ధ తగ్గడానికి కారణం తగు ధర్మప్రచారం లేకపోవడమే. అందుకోసమై అన్ని విధములగా అందరికీ అర్థమయ్యే రీతిలో ధర్మాన్ని ప్రచారం చేయడం ఎంతో అవసరం అని సదస్సు తీర్మానించింది.
9. మాతృమూర్తుల ధర్మనిష్ఠ
ఏ సమాజంలో తల్లి తన పిల్లలను శ్రద్ధగా పెంచుతుందో ఆ సమాజం ధర్మనిలయం అవుతుంది. కనుక హిందూ సమాజంలో ప్రతి మాతృమూర్తి తన పిల్లలకు బాల్యం నుంచి ధర్మబోధను చేయడానికి తగు విధంగా మాతృమూర్తులకు ధర్మనిష్ఠను కలుగచేసే శిక్షణా కార్యకలాపాలు అవసరమని సదస్సు తీర్మానించింది.
10. యువతలో ధర్మప్రీతి, ధర్మాసక్తి
నేటి సమాజంలో హిందూ యువతీ యువకులలో చాలామంది తమ చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం వల్ల, ధనకనకాది ప్రలోభాలవల్ల స్వధర్మాన్ని విడిచిపెట్టి మతాంతరీకరణకు లోనవుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికై ఎన్నో శిక్షణా శిబిరాలు నిర్వహించడం మరియు ఇతర పథకాలు అవసరమని సదస్సు తీర్మానించింది.
11. జీవవైవిధ్యపరిరక్షణ
సహజంగా ఎన్నో అరుదైన వృక్ష జంతుజాతులకు ఆశ్రయమైనది తిరుమల సప్తగిరులు. కనుక ప్రయత్నపూర్వకంగా ఈ తిరుమల వనాలను, తిరుమలలోని వేలాది తీర్థాలను జాగ్రత్తగా పరిరక్షించి తిరుమల, తిరుపతి మరియు వీటి పరిసరప్రాంతాలను ఒక ప్రత్యేక జీవవైవిధ్యక్షేత్రముగా పరిరక్షించాలి అని సదస్సు తీర్మానించింది.
12. వివిధ సేవలు, సత్సంగం, భజనమండళ్ళు ఇతరబృందవ్యవస్థలను బలోపేతం చేయడం2007, 2008 సంవత్సరాలలో నిర్వహింపబడిన ధార్మికసదస్సుల తీర్మానాలను అనుసరించి హరిజన, గిరిజన, మత్స్యకారులు మతాంతరీకరణము నుంచి నివారించుటకై అమలు చేయుచున్న, ప్రస్తుతము తక్కువస్థాయిలో జరుపబడుతున్న మరియు మధ్యలో నిలిపివేయబడిన ప్రణాలికలన్నిటినీ తిరిగి బలోపేతం చేసుకొనవలెనని సదస్సు తీర్మానించింది.
13. జనశక్తి
నిర్మాణంఎన్ని పథకాలున్నా, ఎన్ని ఆలోచనలున్నా సామర్థ్యం కలిగిన కార్యశీలులు లేకపోతే అవి సఫలములు కావు కనుక ప్రతి వ్యక్తిలోని ధర్మపరిరక్షణా సామర్థ్యమును, ఆ ప్రచారానికి తగిన సామర్థ్యమును వీలైనంత ఎక్కువమందికి శిక్షణ ద్వారా నేర్పడం అవసరమని సదస్సు తీర్మానించింది.
14. ఆధ్యాత్మిక కార్యక్రమాలు
శారీరకబలం ఎంత అవసరమో మనిషి ఆత్మవిశ్వాసానికి, ఒడిదుడుకులను తట్టుకోడానికి ఆత్మికబలము కూడా అంతే అవసరం. కనుక హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుటకు తగిన శిక్షణా కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలని సదస్సు తీర్మానించింది.
15. ద్రావిడవేద వికాసానికి ప్రణాళికలుఋగ్వేదము మొదలైన వేదముల వలే 12 మంది ఆళ్వార్లచే మానవాళి శ్రేయస్సుకోసం అందించబడిన ద్రవిడవేదమునకు కూడా తగిన ప్రోత్సాహము, గుర్తింపు అవసరమని సదస్సు తీర్మానించింది.
16. పాఠశాల విద్యార్థులకు కార్యక్రమాలు, ఉపాయాలువివిధ పాఠశాలల్లో ప్రస్తుతం అమలులో ఉన్న పాఠ్యప్రణాళికలలో హిందూ ధర్మ ప్రాధాన్యతకు పెద్దపీట వేయాలని, ఇందుకై మరిన్ని ధర్మప్రబోధకములైన ప్రణాళికలు అవసరమని సదస్సు తీర్మానించింది.
17. భాషాసామర్థ్యం ? తెలుగు, సంస్కృతంహిందూ ధర్మానికి సంబంధించిన అన్ని విధాలైన అంశాలు తెలుగులోనో, సంస్కృతంలోనో ఎక్కువగా ఉన్నవి. వీటిని అర్థం చేసుకోవలెనన్నా, ఆచరించవలెనన్నా ఈ రెండు భాషల పరిజ్ఞానము బాలబాలికలకు, యువతీ యువకులకు అవసరమని వారందరికీ ఆ రెండు భాషలు నేర్పవలెనని సదస్సు తీర్మానించింది.
18. సామాజిక ప్రచారమాధ్యమమునేటి సమాజంలో ఏవిషయమైనా ప్రతి ఒక్కరినీ చేరాలంటే సామాజిక ప్రచారమాధ్యమాలు ఎంతో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. కనుక హిందూ ధర్మాన్ని ప్రచారం చేయుటకు కూడా అన్ని విధాలా ప్రచార, ప్రసార మాధ్యమాలను వినియోగించుకోవాలని సదస్సు తీర్మానించింది.
19. ధార్మికసంస్థలన్నీ ఏకీకృతం కావాలి, తి.తి.దేతో కలిసి ఇటువంటి ధార్మికసదస్సులను నిర్వహించుటలో సహకరించాలి.హిందూ ధర్మరక్షణకై ఈ సదస్సు ఎంతగానో దోహదపడుచున్నదని ఇటువంటి సదస్సులు ప్రతి సంవత్సరానికి ఒకసారి తిరుమలలో లేదా తిరుపతిలోనైనా జరగాలి. అలాగే గ్రామస్థాయిలోను, జిల్లా స్థాయిలోను కూడా నిర్దిష్టకాలపరిమితిలో తరచూ నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది. ఈ సదస్సులో తీసుకున్న తీర్మానాలన్నిటినీ కేవలం తిరుమల తిరుపతి దేవస్థానములు ఆచరించుటయే కాక హిందూ ధర్మపరిరక్షణకు పాటు పడే అన్ని ధార్మికసంస్థలు కూడా అమలుపరచాలని సదస్సు తీర్మానించింది.
అదేవిధంగా, ఛైర్మన్ మాట్లాడుతూ తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారికి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామివారికి, సదస్సుకు విచ్చేసిన పీఠాధిపతులకు, మఠాధిపతులకు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ్‌కుమార్ సదస్సు నిర్వహణకు ఎంతగానో సహకరించారని తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే ఏర్పాట్లు చేసి సదస్సును విజయవంతం చేసిన చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, సీపీఆర్వో డా. టి.రవి, ధార్మిక ప్రాజెక్టుల అధికారులు, ఉద్యానవన, అన్నప్రసాదం, ఆరోగ్య తదితర విభాగాల అధికారులను, సిబ్బందిని ప్రశంసించారు.