విజయవాడ, ఫిబ్రవరి 3: వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతున్నారు. ఈ జాబితాలో కొందరు తాజా మాజీ మంత్రులు సైతం ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవైపు అభ్యర్థులను మార్చుతూనే.. పార్టీ బాధ్యులను సైతం జగన్‌ మార్చడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ, గుంటూరు బాధ్యులను తప్పించడం విశేషం. గుంటూరు రీజనల్‌ కోఆర్డినేటర్‌ గా ఉన్న ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, కృష్ణా జిల్లా కోఆర్డినేటర్‌ మర్రి రాజశేఖర్‌ లను జగన్‌ తప్పించారు. ఆ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. అయితే ఆ రెండు జిల్లాల్లో ఇప్పటికే కీలక ప్రజాప్రతినిధులు వైసీపీని వీడారు. అయినా సరే జగన్‌ లెక్కచేయకుండా పార్టీలో సైతం మార్పులు చేస్తుండడం సొంత పార్టీ నేతలకు సైతం అర్థం కావడం లేదు.అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్‌ జగన్‌ కు అత్యంత ఆప్తులు. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ ఇద్దరు నేతలు జగన్‌ వెంట నడిచారు. 2014లో అయోధ్య రామిరెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు రాజ్యసభ పదవిలో జగన్‌ కూర్చోబెట్టారు. గత ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్‌ ను మర్రి రాజశేఖర్‌ కు కాకుండా.. అప్పుడే పార్టీలో చేరిన విడదల రజనీకి ఇచ్చారు. ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని రాజశేఖర్‌ కు హావిూ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్‌ పేరు చాలాసార్లు వినిపించింది. కానీ గత ఏడాది అవకాశం ఇచ్చారు. కానీ రాజశేఖర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశించారు. కానీ జగన్‌ మొండి చేయి చూపారు. అయితే ఈ ఇద్దరు నేతలు రీజనల్‌ కోఆర్డినేటర్లుగా బాగానే పని చేస్తున్నారు. కానీ జగన్‌ సంతృప్తి చెందలేదు. వీరిని పదవుల నుంచి తొలగించారు.అయితే వీరిని పదవి నుంచి తొలగింపు వెనుక చాలా రకాల రాజకీయ కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయోధ్యరామిరెడ్డికి సోదరుడు. మంగళగిరి టిక్కెట్ను ఇవ్వనని జగన్‌ తేల్చి చెప్పడంతో రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే సోదరుడు పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకట్ట వేయడంలో అయోధ్య రామిరెడ్డి ఫెయిల్‌ అయ్యారని జగన్‌ భావిస్తున్నారు. మరోవైపు అయోధ్య రామిరెడ్డి సొంత బావమరిది, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి టిక్కెట్‌ ఇచ్చిన పోటీ చేయనని తేల్చి చెప్పారు. దీంతో అయోధ్య రామిరెడ్డి పై జగన్‌ అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు మర్రి రాజశేఖర్‌ సైతం పార్టీకి రాజీనామా చేసిన ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇది జగన్‌ కు మింగుడు పడడం లేదు. రాజశేఖర్‌ సైతం పార్టీని వీడుతారని టాక్‌ నడుస్తోంది. అందుకే రాజశేఖర్‌ పై వేటు వేసినట్లు తెలుస్తోంది.ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి నష్టం తప్పదని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రభావం అధికంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రజా వ్యతిరేకత తోడైతే.. వైసీపీకి కష్టమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు జగన్‌ మార్పుల ప్రయోగం చేస్తుండడంతో.. నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో జగన్‌ వ్యవహార శైలి సొంత పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇలానే దూకుడుగా ముందుకు పోతే.. చాలామంది వైసీపీ నేతలు బయటకు వెళ్తారని టాక్‌ నడుస్తోంది. మరోవైపు టిడిపి, జనసేన కూటమి ఈ రెండు జిల్లాల్లో పట్టు బిగిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో చాలామంది వైసిపి నేతలు బెంబేలెత్తిపోతున్నారు. కొందరు ఆశావహులు సైతం వెనక్కి తగ్గుతున్నట్లు టాక్‌ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్‌ చేజేతులా వైసీపీ నేతలను దూరం చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *