విశాఖపట్టణం, డిసెంబర్ 19: పాదయాత్రతో లోకేష్ తనను తాను నిరూపించుకున్నారా? పరిణితి సాధించారా? నాయకత్వ పటిమను పెంచుకున్నారా? పార్టీ శ్రేణులకు దగ్గరయ్యారా? ప్రజల్లో మార్పు తీసుకొచ్చారా? వారి మనసును గెలుచుకున్నారా? అంటే దీనికి మిశ్రమ జవాబులే వస్తున్నాయి. తనను తాను ఒక నాయకుడిగా ఆవిష్కరించుకున్న లోకేష్ సంచలనాలకు మాత్రం తెర తీయలేకపోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం పాస్ మార్కులు దాటారే తప్ప.. శత శాతం సాధించలేకపోయారన్నది విశ్లేషకుల మాట.అయితే ఒక్కటి మాత్రం చెప్పగలం.. ఈ పాదయాత్ర నారా లోకేష్ ఇమేజ్ ను అమాంతం మార్చేసింది. ఆయనపై వచ్చిన కామెంట్స్ కు సరైన సమాధానం చెప్పింది. తనలోనూ నాయకత్వ పటిమ ఉందని.. దానిని ఎవరూ నీరుగార్చలేరు అని మాత్రం లోకేష్ సమాధానం ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభం నుంచి అడ్డుకోవాలని చూడడం వాస్తవం. లోకేష్ ఎక్కడ తడబడితే దుష్ప్రచారానికి తెర తీయడం నిజం. కానీ తొలినాళ్లలో ఆ అవకాశం ఇచ్చిన లోకేష్.. అనతి కాలంలోనే తనను తాను సరిదిద్దుకున్నారు. తప్పిదాలకు చెక్ చెప్పారు. ఆటంకాలను ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకోగలిగారు. తన విషయంలో చులకనగా మాట్లాడిన ప్రత్యర్థులు, సొంత పార్టీ శ్రేణులకు సరైన సమాధానం చెప్పారు.లోకేష్ పాదయాత్ర చేస్తారంటే సొంత పార్టీ శ్రేణులే నమ్మలేదు. పైగా కామెడీ చేసిన వారున్నారు. లోకేష్ ప్రయత్నాన్ని నీరుగార్చాలని చూసినవారు ఉన్నారు. వైసీపీ అయితే వందలాదిమంది ప్రైవేట్ సైన్యాన్ని పంపించింది. ఇంటలిజెన్స్ వ్యవస్థను వినియోగించుకుంది. కానీ వాటన్నింటినీ అధిగమించి లోకేష్ పాదయాత్ర లక్ష్యాన్ని పూర్తి చేయడం గొప్ప విషయమే. తన పై వందల కోట్లు వెచ్చించి తప్పుడు ప్రచారానికి దిగిన వైసీపీకి సరైన సమాధానం ఇచ్చారు. చంద్రబాబు తర్వాత తనకు అవకాశం ఉందని నిరూపించుకున్నారు. ప్రజలకంటే పార్టీపై పట్టు నిలుపుకునేందుకు పాదయాత్రను ఒక వరం లా వినియోగించుకున్నారు.అయితే అనుకున్న స్థాయిలో ప్రజలను ఆకట్టుకోలేకపోవడం మైనస్. మంచి వాగ్దాటి లేకపోవడం, సమయస్ఫూర్తిగా మాట్లాడలేకపోవడం లోటుగా మారింది. స్థానిక సమస్యలపై మాట్లాడే సమయంలో సరైన అధ్యయనం చేయకపోవడం, స్థానిక పరిస్థితులను అనుగుణంగా పావులు కదపకపోవడం పాదయాత్ర అంతగా పస లేకుండా పోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ పూర్వ వైభవానికి లోకేష్ శక్తి యుక్తులు చాలవని.. మరింత రాటు తేలాల్సిన అవసరం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా పార్టీలో యువనాయకత్వాన్ని ప్రోత్సహించే భాగంగా.. తనకు తాను స్వతంత్ర నిర్ణయాలు ప్రకటించడం కూడా ప్రతికూలతలు చూపినట్లుతెలుస్తోంది. దాదాపు 90 కి పైగా నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో స్పష్టత నిచ్చే క్రమంలో పార్టీలో వర్గాలను ప్రోత్సహించారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఒక్క మాట మాత్రం నిజం లోకేష్ తనను తాను పాదయాత్ర ద్వారా పరిపూర్ణమైన నేతగా ఆవిష్కరించుకున్నారు. అంతవరకు ఓకే చెప్పాల్సిందే.
పాదయాత్ర లెక్కదీ…
226 రోజుల్లో 3,132 కిలోవిూటర్లు లోకేష్ పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. జనవరి 27న కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 11 ఉమ్మడి జిల్లాల్లో.. 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు.2,029 గ్రామాల విూదుగా యాత్ర సాగింది. 70 బహిరంగ సభలు, 154 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని లోకేష్ సమస్యలను తెలుసుకున్నారు. గ్రేటర్ విశాఖ శివాజీ నగర్ లో లోకేష్ పాదయాత్ర సోమవారం ముగిసింది.విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి లో పాదయాత్ర విజయోత్సవ సభ నిర్వహించనున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పాదయాత్రలు చేశారు. ప్రజా దీవెనలు అందుకున్నారు. అధికారంలోకి రాగలిగారు. 1994లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ కాక వికలమైంది. 1999లో రెండోసారి ఓటమి ఎదురు కావడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. చంద్రబాబు ఎత్తుగడలకు పార్టీ ఉనికి లేకుండా పోయింది. అటువంటి సమయంలోనే నేనున్నాను అంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేశారు. 2004లో పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు.2013లో చంద్రబాబు పాదయాత్ర చేశారు. కుప్పం నుంచి విశాఖ వరకు పాదయాత్ర చేపట్టారు. దాదాపు 67 సంవత్సరాల వయసులో పాదయాత్రకు దిగడం విశేషం. ఆ ఎన్నికల్లో చంద్రబాబు గెలుపొందారు. అటు తరువాత జగన్ 2018లో పాదయాత్ర చేశారు. అటు సిపిఐ కేసుల విచారణకు వారం వారం హాజరవుతూనే.. పాదయాత్రను పూర్తి చేశారు. కడప జిల్లా ఏడుపాలపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు యాత్ర కొనసాగింది. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాగలిగారు.లోకేష్ సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. అయితే ప్రారంభం నుంచే కొద్దిపాటి అవరోధాలను ఎదుర్కొన్నారు. తొలి రోజే తారకరత్నకు గుండెపోటు రావడంతో పాదయాత్ర పై ప్రభావం చూపింది. ఆయన అకాల మరణంతో ఒక్కరోజు పాటు పాదయాత్ర నిలిచిపోయింది. మధ్యలో రెండు రోజులు పాటు కోర్టుకు హాజరు కావడంతో బ్రేక్ పడిరది. సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టు తర్వాత సుదీర్ఘకాలం పాటు నిలిచిపోయింది. కొద్ది రోజుల కిందట రాజోలు నియోజకవర్గం లో ప్రారంభమైన పాదయాత్ర.. తూర్పుగోదావరిజిల్లా విూదుగా.. విశాఖలో ప్రవేశించింది. గ్రేటర్ విశాఖలో నేడు ముగియనుంది. లోకేష్ పాదయాత్రతో టిడిపికి పూర్వవైభవం ఖాయమని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.