విజయవాడ, డిసెంబర్ 18: టిడిపి నుంచి వైసీపీలో చేరిన ఆ నలుగురికి టికెట్ దక్కడం లేదా? వైసీపీ హై కమాండ్ హ్యాండ్ ఇవ్వనుందా?తెలంగాణలో ఫలితాలతో ఈ నిర్ణయానికి వచ్చిందా? ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన మద్దాలి గిరి, వల్లభనేని వంశీ మోహన్, కరణం బలరామకృష్ణ, వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి ఫిరాయించారు. విూకు సముచిత స్థానం కల్పిస్తాం.. మరోసారి టిక్కెట్లు ఇస్తాము అని.. ఆఫర్ ఇచ్చి మరీ తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు ఏకంగా టిక్కెట్లు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. దీంతో వీరి పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అభ్యర్థులను మార్చుతూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లే కేసీఆర్ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని జగన్ భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి గుర్తించారు. అందుకే తాజా ఫార్ములాను అమలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. టిడిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను సైతం వివిధ కారణాలు చూపుతూ స్థానచలనం చేయడానికి సిద్ధపడుతున్నారు. అలా పక్కకు తప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మద్దాలి గిరికి షాక్ ఇచ్చారు. ఆయనకు మాట మాత్రం గానైనా చెప్పకుండా మంత్రి విడుదల రజనీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా మద్దాలి గిరి నీరుగారిపోయారు. టిడిపి నుంచి పిలిచి మరీ అవమానించారని బాధపడుతున్నారు. ఆర్యవైశ్య సంఘాలను అడ్డం పెట్టుకొని జగన్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్ వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఏం చేయాలో మద్దాలి గిరికి తోచడం లేదు. అటు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ఛాన్స్ లేదు.గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విషయంలో కూడా హై కమాండ్ ఒక ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఎప్పటికీ ఆయనతో వైసీపీ కీలక నేతలు మాట్లాడినట్లు టాక్ నడుస్తోంది. కానీ ఆయనకు సైతం స్థానచలనం చూపించి పక్కకు తప్పించనున్నారు అన్న వార్త బయటకు వచ్చింది. ఈ మధ్యన విూడియాలో సైతం వంశీ ఎక్కడ కనిపించడం లేదు. ఆయన్ను ఎంపీగా పోటీ చేయిస్తారన్న ఒక టాక్ జరుగుతోంది. అంటే గన్నవరం నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి ఆయన ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి. అయితే ప్రస్తుతం ఆయనకు ఆప్షన్ లేదు. టిడిపి, జనసేన డోర్లు ఏనాడో క్లోజ్ అయ్యాయి.కరణం బలరామకృష్ణను చీరాల నుంచి తప్పించి ఒంగోలు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచిన బలరాం వైసీపీలోకి ఫిరాయించారు. ఆయనకు ఏమాత్రం సంబంధంలేని ఒంగోలు నుంచి పోటీ చేయించాలని చూడడం చూస్తుంటే.. పక్కకు తప్పించే ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపార రీత్యా భయపెట్టి బలరాంను వైసీపీలో చేర్చుకున్నారు. చీరాల అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తామని హావిూ ఇచ్చారు. తీరా ఇప్పుడు హ్యాండ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నలుగురికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు లేనట్టే.