=విశాఖపట్టణం, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ విశాఖలోని రుషికొండ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ సర్కార్… రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయంతోపాటు కొన్ని భవనాలు నిర్మిస్తోంది. అయితే.. కొండపై జరుగుతున్న నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. హైకోర్ట్?లో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు రుషికొండపై అక్రమ తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనల తీవ్రతను తేల్చేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నియమించిన నిపుణుల కమిటీ విశాఖ చేరుకుని… రుషికొండపై నిర్మిస్తున్న భవనాలను పరిశీలించింది. రుషికొండకు చేరుకున్న కేంద్ర కమిటీ బృందం సభ్యులను.. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అధికారులు రిసీవ్ చేసుకున్నారు. అధికారులు స్వాగతం పలికారు. కె.గౌరప్పన్ నేతృత్వంలో నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ పబ్లిక్స్ వర్క్స్ విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఎంవోఈఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నుంచి కమిటీ సభ్యులు వచ్చారు. వీరంతా రుషికొండకు చేరుకుని టూరిజం శాఖ నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించారు.ముందుగా కొండను ఆనుకొని ఉన్న క్యాంపు కార్యాలయానికి వెళ్లిన బృంద సభ్యులు అక్కడ కొద్ది నిమిషాలు అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత ప్రతీ బ్లాక్ దగ్గరకు వెళ్లి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీటీడీసీ, జీవీఎంసీ అధికారులు దగ్గరుండి కేంద్ర కమిటీ సభ్యులు అడిగిన అన్నీ వివరాలను అందించారు. రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించి కేంద్ర కమిటీ సభ్యులు… ఆతర్వాత అక్కడి నుంచి తీరం వెంట మట్టిని డంప్ చేసిన ప్రాంతాలను కూడా చూశారు. సాయంత్రం ఆరు గంటల వరకు కేంద్ర బృందం తనిఖీలు జరిగాయి. నిజానికి గత ఏడాది హైకోర్ట్ నియమించిన నిపుణుల కమిటీ రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగి ఉంటే సరిచేయాలని హైకోర్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖను ఆదేశించింది. అయితే మళ్లీ పిటిషన్ దార్లు సరికొత్త ఆరోపణలను కోర్ట్ ముందుకు తీసుకువచ్చారు. రుషికొండపై నిర్మిస్తున్న ప్రతి బ్లాకులోనూ సీఆర్‌జెడ్`తీర ప్రాంత క్రమబద్ధీకరణ జోన్ ఉల్లంఘనలు జరిగాయని… వాటిపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు… నిబంధనల ఉల్లంఘనలపై ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖను ఆదేశించింది హైకోర్టు. దీంతో ఎంవోఈఎఫ్ ఉల్లంఘనల పరిశీలనకు మరో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు గత నెల 29న కోర్టుకు తెలిపింది కేంద్ర పర్యావరణ అటవీశాఖ. ఆ కమిటీ.. ఇప్పుడు రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించింది.రుషికొండపై నిర్మాణాలను పూర్తిగా పరిశీలించ నుంది కేంద్ర కమిటీ. ఆ తర్వాత పూర్తి వివరాలతో హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత హైకోర్టు ధర్మాసనం.. ఏ విధమైన ఉత్తర్వులు ఇస్తుందో చూడాలి.