విజయవాడ, డిసెంబర్ 5: ఏపీ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతే’ అని మరోసారి స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు రాజ్యసభలోఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి సహాయ మంత్రి కౌశల్ కుమార్ రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు మాస్టర్ ప్లాన్లు ఉన్నాయని, వీటిని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించినట్లు స్పష్టం చేశారు. అమరావతికి సైతం మాస్టర్ ప్లాన్ ఉందని, దీన్ని కూడా కేంద్రం ఆమోదించిందని పేర్కొన్నారు. త్రిపుర రాజధాని అగర్తలా, నాగాలాండ్ రాజధాని కోహిమాలకు మాత్రమే మాస్టర్ ప్లాన్లు లేవని తెలిపారు. దేశంలోని 39 శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదనేది నిజమా.? కాదా.? అని రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.మరోవైపు, ఏపీ ప్రభుత్వం విశాఖ నుంచే పాలన సాగించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ నుంచే విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తామని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు పలు ప్రభుత్వ విభాగాలు, అధికారుల కార్యాలయాలు కేటాయిస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఈ క్రమంలో రాజధాని తరలింపును అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. దాదాపు 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ, ఏపీ సర్కారు నవంబర్ 23న జీవో ఇచ్చింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయిస్తూ, మొత్తం 2.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో కేంద్రం అమరావతే ఏపీ రాజధాని అంటూ సష్టమైన ప్రకటన ఇవ్వడం చర్చనీయాంశమైంది.