డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి. అతడు 1950 నుండి 1962 వరకు రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహించాడు. ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా ‘బాబూ’ అని పిలిచేవారు. అతడు భారతీయ రాజకీయ నాయకునిగా భారత జాతీయ కాంగ్రెస్‌ లో భారత స్వాంతంత్య్రోద్యమ కాలంలో చేరాడు. అతడు బీహార్‌ లో ప్రముఖ నాయకునిగా ఎదిగాడు. మహాత్మాగాంధీ మద్దతుదారునిగా అతడు 1931 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, 1941లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1946 ఎన్నికల తరువాత అతడు ఆహారం, వ్యవసాయం శాఖకు భారత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించాడు. అతడు భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి అధ్యక్షత వహించాడు.1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన తరువాత అతడు రాగ్యాంగ పరిషత్తు ద్వారా మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. 1951 సార్వత్రిక ఎన్నికల తరువాత అతడు మొదటి భారత పార్లమెంటు ఎలక్టోరల్‌ కాలేజ్‌ ద్వారా రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఒక రాష్ట్రపతిగా అతడు పక్షపాత ధోరణి లేకుండా, ఉన్నత పదవులలో ఉన్నవారు స్వతంత్రంగా వ్యవహరించేందుకుగాను కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల నుండి వైదొలగి కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఈ పదవి అలంకారప్రాయ మైనదైనప్పటికీ అతడు భారతదేశంలో విద్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు గాను అప్పటి ప్రధానమంత్రి జవాహర్‌ లాల్‌ నెహ్రూ కు వివిధ సందర్భాలలో సలహాలనిచ్చేవాడు. 1957లో అతడు రెండవసారి రాష్ట్రపతిగా ఎన్నికై, రెండు సార్లు భారత రాష్ట్రపతి పదవినలంకరించిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు.రాజేంద్ర ప్రసాద్‌ బీహార్‌ రాష్ట్రంలో శివాన్‌ జిల్లాలోని జెర్దాయ్‌ గ్రామంలో 1884లో డిసెంబరు 3 న జన్మించాడు. అతని తండ్రి మహదేవ్‌ సహాయ్‌ సంస్కృతం, పర్శియను భాషలలో పండితుడు. తల్లి కమలేశ్వరీ దేవి ఎప్పుడూ రామాయణం నుండి కథలు వివరించేది. ఐదవ ఏటనే పర్షియన్‌ భాష, హిందీ భాష , అంకగణితం ను నేర్చుకోవడానికి ఒక మౌల్వీ దగ్గరకు పంపించబడ్డాడు. తరువాత ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసాడు. 12 సంవత్సరాల వయసులోనే రాజ్‌వంశీ దేవిని వివాహం చేసుకున్నాడు. అటు తరువాత విద్యకై పాట్నాలో తన అన్న మహేంద్ర ప్రసాద్‌ వద్ద ఉంటూ ఆర్‌.కె.ఘోష్‌ పాఠశాలలో చదువుకున్నాడు. మరల ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో చేరి కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై నెలకు రూ.30 ఉపకారవేతనం పొందాడు.1902లో అతడు కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. మొదట్లో సైన్సు విద్యార్థి. 1904లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఎఫ్‌.ఎ ఉత్తీర్ణుడయ్యాడు. అక్కడే 1905లో మొదటి స్థానంలో గ్రాడ్యుయేషన్‌ చేసాడు. అతని అధ్యాపకులలో జగదీష్‌ చంద్రబోసు, ప్రఫుల్ల చంద్ర రాయ్‌ మొదలగువారు ఉన్నారు. అతడి మేథాశక్తికి ఒక ఎక్జామినర్‌ ప్రభావితుడై అతడి పరీక్షా జవాబు పత్రంపై ‘‘పరీక్షకుని కంటే పరీక్షితుడు గొప్పవాడు’’ అనే వ్యాఖ్య రాసాడు. అతడు ఉపాద్యాయునిగా అనేక విద్యాసంస్థలలో పనిచేసాడు. ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ పూర్తి చేసిన తరువాత అతడు బీహార్‌ లోని ముజఫర్‌పూర్‌ లాంగట్‌ సింగ్‌ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకునిగా చేరాడు. తరువాత ఆ సంస్థకు ప్రధానాచార్యునిగా తన సేవలనందించాడు. తరువాత 1909లో కలకత్తాలోని రిప్పన్‌ కళాశాలలో న్యాయవాద విద్యను అభ్యసించడానికి గాను ఉద్యోగాన్ని వదిలి వెళ్ళాడు. అతడు ఆ కళాశాలలో న్యాయవాద విద్యను అభ్యసించే సమయంలో కలకత్తా సిటీ కళాశాలలో ఆర్థికశాస్త్ర అధ్యాపకునిగా పనిచేసాడు. 1915 లో ‘‘మాస్టర్‌ ఆఫ్‌ లా’’ పరీక్షలకు హాజరై ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని పొందాడు. 1937లో అలహాబాదు విశ్వవిద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో డాక్టరేట్‌ డిగ్రీని పొందాడు. 1911 లో కాంగ్రేసులో చేరాడు. కానీ అతని కుటుంబ పరిస్థితి ఏమంత బాగాలేదు. కుటుంబం తన సహాయానికై ఎదురు చూస్తున్న తరుణంలో, స్వాతంత్య్ర సమరంలో పాల్గొనేందుకు అన్నగారిని అనుమతి అడిగాడు.అతడు అందుకు ఒప్పుకోక పోవటం వలన 1916 లో, బీహార్‌, ఒడిషా రాష్ట్రాల హైకోర్టులలో చేరాడు. తరువాత 1917లో అతడు పాట్నా విశ్వవిద్యాలయంలోని సెనేట్‌, సిండికేట్‌ లో మొదటి సభ్యునిగా నియమింపబడ్డాడు. బీహార్‌ లో సిల్క్‌`టౌన్‌ గా ప్రసిద్ధిగాంచిన భగల్‌పూర్‌ లో న్యాయవాద పాక్టీసును చేపట్టాడు. ఏదైనా విచారణ జరుగుతున్నప్పుడు, తన వాదనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉదాహరణలు చూపలేకపోయినప్పుడు, న్యాయమూర్తులు రాజేంద్ర ప్రసాదునే ఉదాహరణ ఇవ్వమని అడిగేవారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *