విజయవాడ, డిసెంబర్‌ 2: తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీది విచిత్ర పరిస్థితి. ఆ పార్టీ శ్రేణులు కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నాయి. నాయకత్వం మాత్రం వ్యూహాత్మకంగా సైలెంట్‌ గా ఉంది. కొన్నిచోట్ల బిజెపి, మరికొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ ప్రచార కార్యక్రమాల్లో టిడిపి జెండాలు కనిపిస్తున్నాయి. పార్టీ శ్రేణులను నియంత్రించే స్థితిలో నాయకత్వం లేదు. అయితే అసలు టిడిపి వ్యూహం అనేది ఏంటన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలవాలన్న బలమైన ఆకాంక్ష టిడిపిలో ఉందన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.తెలంగాణ ఎన్నికల ఫలితాల పర్యవసానాలు ఏపీ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి రేవంత్‌ రెడ్డి సీఎం అయితే తెలుగుదేశం పార్టీలో ఒక ఊపు వచ్చే అవకాశం ఉంది. కచ్చితంగా అది వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశానికి ఒక టానిక్‌ లా పనిచేస్తుంది. గత ఎన్నికల్లో కెసిఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ఏ స్థాయిలో వైసీపీకి సహాయం చేసిందో అందరికీ తెలిసిందే. ఏపీలో వ్యాపారస్తుల మూలాలు, సినీ రంగం ప్రభావం వంటి వాటితో జగన్కు కేసిఆర్‌ చాలా రకాలుగా సహాయ సహకారాలు అందించారు.వైసిపి గెలుపునకు ఇదో ప్రధాన కారణమైంది.తెలుగుదేశం పార్టీ సైలెంట్‌ గా ఉన్నా.. మెజారిటీ క్యాడర్‌ మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి జై కొట్టినట్టు వార్తలు వచ్చాయి. ప్రధానంగా ఓ ప్రధాన సామాజిక వర్గం కాంగ్రెస్కు బాహటంగానే మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. అది తమ వల్లనేనని.. చంద్రబాబుకు ఇబ్బందులు పెట్టడం వల్లే అటు బిఆర్‌ఎస్‌, ఇటు బిజెపి ఓడిపోయాయని ప్రచారం మొదలు పెడతారు. జనసేనలో సైతం ఓ రకమైన ఆలోచన తీసుకొస్తారు. ఒకవేళ తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు వస్తే చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తారు. ఒక్క తెలంగాణ ఫలితం తోనే ఏపీ రాజకీయాల్లో టిడిపి అనుసరించే వ్యూహం ఆధారపడి ఉంది. అయితే బీ ఆర్‌ఎస్‌ గెలిచినా.. బిజెపికి ఆశించిన స్థాయిలో స్థానాలు వచ్చినా.. అది తెలుగుదేశం పార్టీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి పర్యవసానాలకైనా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. తెలంగాణ ఫలితాల తరువాతే సరికొత్త వ్యూహాలను అమలు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *