` నంద్యాల: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి ఎప్పుడైనా పొలాలను పరిశీలించాడా, రైతులతో కలిసి మాట్లాడాడా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఆయనకు కరువుపై అవగాహన లేదని విమర్శించారు. నంద్యాలలో సిపిఐ కార్యదర్శి రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరువుతో రైతులు అల్లడుతుంటే అధికారులు పట్టించుకోకుండా నిద్రపోతున్నారని విమర్శించారు. శ్రీశైలం జలాశయంలో నీళ్లు లేవని, రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల ఎకరాల్లో పంట వేయలేదన్నారు. 440 మండలాల్లో కరువు ఉంటే కేవలం 103 మండలాలనే కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని ఆరోపించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ప్రజలు వలసలు పోతున్నారని, వలసలు నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వాన్ని చూసైనా మన రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలన్నారు. అక్కడి ప్రభుత్వం అక్టోబర్‌ నెలలోనే కరువు జిల్లాలు ప్రకటించి ఆ మేరకు కేంద్ర బంధాన్ని పర్యటింపజేసుకుందన్నారు. అసలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందా, అది బహిర్గతం చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. రెవెన్యూశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ వీరంతా ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. వీటిపై ఈనెల 20, 21 తేదీల్లో విజయవాడలో 30 గంటల పాటు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక ఎన్నికల సమయంలో అప్పర్‌ బ్రదర్‌ ప్రాజెక్టు చేపడతామని చెప్పి కేంద్రం 5300 కోట్లను మంజూరు చేసిందని, అప్పర్‌ భద్ర కడితే రాయలసీమకు చుక్క నీరు కూడా రాదన్నారు. నిన్న నూజివీడులో సీఎం జగన్‌ పట్టాలను పంపిణి చేశారని, అప్పట్లోనే సిపిఐ పార్టీ ఆ భూములను పోరాడి సాధించుకుందని, గతాన్ని జగన్‌ తెలుసుకోవాలని రామకృష్ణ హితవు పలికారు. అదీకాక తిరిగి సిపిఐ నాయకులనే హౌస్‌ అరెస్ట్‌ చేయడం ఎంతవరకు సబబని ఆయన నిలదీశారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు రామాంజనేయులు, సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు పాల్గొన్నారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *