ఒంగోలు, నవంబర్ 18 18:మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వైసీపీలో ఎసరు పెట్టే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఒక పద్ధతి ప్రకారం బాలినేనిని పార్టీ నుంచి బయటకు పంపించాలని ప్లాన్ జరుగుతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా బాలినేని పై హై కమాండ్ అనుమానపు చూపులు చూస్తోంది.ప్రకాశం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బాలినేని వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించింది. వారందరిపై సస్పెన్షన్ వేటు వేస్తూ వస్తోంది. ఇప్పుడు వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి ప్రకటనతో.. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పొమ్మనలేక పొగ ప్రారంభమైందని వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో ప్రకాశం జిల్లా అంతటా బాలినేని హవా నడిచేది. గత రెండు ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో నుంచి ఎవరిని బరిలో దించాలి? అన్నది బాలి నేనే నిర్ణయించేవారు. జగన్ సైతం ఆయనకు అంత గౌరవం ఇచ్చేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన ప్రతిష్ట మసకబారింది. రెండేళ్ల కిందట మంత్రివర్గ విస్తరణలో తనకు మళ్ళీ అవకాశం దక్కుతుందని బాలినేని భావించారు. కానీ హై కమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. అటు తరువాత సమన్వయ బాధ్యతలు వహిస్తున్న నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తిరుగుబావుట ఎగురవేశారు. దీంతో సమన్వయకర్త బాధ్యతల నుంచి బాలినేని తప్పుకున్నారు.అయితే వైవి సుబ్బారెడ్డి రూపంలో బాలినేని ఆధిపత్యానికి ఎక్కడికక్కడే గండిపడుతూ వస్తుంది. తనను రాజకీయంగా దెబ్బ కొట్టాలని వైవి ప్రయత్నిస్తున్నారని పలుమార్లు సీఎం జగన్కు బాలినేని ఫిర్యాదు చేశారు. ఒకటి రెండుసార్లు పంచాయితీ నడిచినా.. బాలినేని కి మాత్రం పూర్వ గౌరవం దక్కడం లేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బాలినేని అనుచరులుగా భావిస్తున్న నేతలను హై కమాండ్ క్రమశిక్షణ చర్యలు కింద సస్పెండ్ చేసింది. అంతటితో ఆగకుండా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా.. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను వైసీపీ హై కమాండ్ ఖరారు చేస్తోంది. తనను కనీసం సంప్రదించకుండా ఏకంగా అభ్యర్థుల పేరు ప్రకటించడం ఏమిటని బాలినేని అసంతృప్తికి గురయ్యారు. ఇటీవల నకిలీ స్టాంపుల కుంభకోణంలో ఎదురైన పరిణామాలతో తన సెక్యూరిటీని సైతం సరెండర్ చేశారు. చివరకు సీఎంవో కలుగజేసుకుని సమస్యను పరిష్కరించింది. రెండేళ్లుగా బాలినేని వ్యవహరించిన తీరుపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైవి సుబ్బారెడ్డి తాను ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఒంగోలు రాజకీయాలపై ఫుల్ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒకే వర్గంగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పోటీకి సిద్ధపడుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైవి సుబ్బారెడ్డి ప్రకటన చేయడంతో వైసిపి హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమం చూసుకుంటే బాలినేనికి వైసీపీ నుంచి ఎసరు ప్రారంభమైందని టాక్ నడుస్తోంది. కొద్ది రోజుల్లో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.