త్వరలో రాష్ట్రము లో ఎయిర్ అంబులెన్సులు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ సెప్టెంబర్ 25: త్వరలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎయిర్ అంబులెన్సులు ప్రవేశపెట్టబోతున్నాం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడిన హెలికాప్టర్ ద్వారా వారిని దవాఖానకు తరలిస్తాం. కోటీశ్వరులకే పరిమితమైన ఈ సేవలను పేదలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ది మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు. రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదికను మంత్రి హరీశ్ రావు సోమవారం విడుదల చేశారు. ఇదే వేదికగా 310 మంది ఫార్మసిస్టులకు మంత్రి హరీశ్‌రావు పోస్టింగ్ ఆర్డర్స్ అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. నేడు ఫార్మసిస్టులుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతూ వైద్య ఆరోగ్యశాఖ కుటుంబంలో చేరుతున్న 310 మంది ఫార్మసిస్టులకు స్వాగతం తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 105, టీవీవీపీ పరిధిలోని 135, డీఎంఈ 70 పోస్టులకు గాను మొత్తం 310 మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో సేవలు బాగుండాలంటే అందరికీ తగినన్ని ఔషధాలు ఉండాలి. ఔషధాలను సమకూర్చడం, రోగులకు అందించడంలో ఫార్మసిస్టులది కీలకపాత్ర. ప్రభుత్వ ఉద్యోగం అనేది గొప్ప అవకాశం. ప్రైవేటు ఉద్యోగాలతో ఉపాధి దొరికితే.. ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుంది. రోగులకు చిరునవ్వుతో మందులు అందిస్తే వారు ఎంతో సంతోషిస్తారు అని హరీశ్‌రావు తెలిపారు.