రాయచోటి 14 నవంబర్ 2023: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల కు చెందిన దళిత న్యాయవాది మందా విజయ్ కుమార్ పై దాడి చేసిన వైసీపీ మూకలపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి తక్షణ అరెస్టు చేయాలని భారత న్యాయవాదుల సంఘం (IAL) అన్నమయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఈశ్వర్ డిమాండ్ చేశారు. న్యాయవాది విజయ్ కుమార్ పై సోమవారం జరిగిన దాడికి నిరసనగా అన్నమయ్య జిల్లాభారత న్యాయవాదుల సంఘం మంగళవారం ఉదయం అంబేద్కర్ ఫ్లెక్సీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా కడప అన్నమయ్య జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఈశ్వర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రాజ్యాంగేతర శక్తులు గా వైసీపీ కార్యకర్తలు తయారయ్యారని, రాజ్యాంగబద్ధంగా చట్టాల ప్రకారం కోర్టు ఆదేశాలను అనుసరించి నడుచుకునే వారంటే వైసిపి నాయకులకు ఇష్టం లేదని రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ఏ వ్యవస్థను కూడా వీరు గౌరవించడం లేదని ఆయన విమర్శించారు. నంద్యాల జిల్లా కు చెందిన న్యాయవాది విజయకుమార్ చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నాడని నడివీధిలో చొక్కా కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ దాడి చేసి పోలీసులుకు అప్పజెప్పి అతనిపైనే తప్పుడు కేసు బనాయించారంటే వారి దౌర్జన్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఆయన అన్నారు. హక్కుల సంఘం న్యాయవాది పి. రెడ్డయ్య మాట్లాడుతూ పోలీసులు తమ విధులను మరిచిపోయి న్యాయవాదిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా వైసీపీ కార్యకర్తలు చెప్పినట్లు విని న్యాయవాదిపైనే తప్పుడు కేసును నమోదు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. అన్నమయ్య జిల్లా న్యాయవాదుల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షులు రాజకుమార్ రాజు మాట్లాడుతూ న్యాయవాది చంద్రశేఖర్ పై పెట్టిన తప్పుడు కేసును తక్షణం రద్దుచేసి న్యాయవాదిపై దాడి చేసిన వైసీపీ ముకలపై కఠిన చర్యలు తీసుకుని తక్షణ అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు డి.నాగముని మాట్లాడుతూ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్ అదే బడుగు బలహీనులపై నిత్యము ఏదో ఒక మూల వైసిపి మూకలు దాడులు చేస్తున్నారని ఇలాంటి వారిపై జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవని, ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలుచరమగీతం పాడకపోతే మన రాజ్యాంగము ఉండదు రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన వ్యవస్థలు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో IALసహాయ కార్యదర్శి మిఠాయిగిరి ఖాదర్ బాషా, ఉదయగిరి రామాంజనేయులు, సీనియర్ న్యాయవాదులు ధనుంజయ్ కుమార్, చిన్నయ్య, కృష్ణయ్య, టి.వి. రమణ, మంద నాగేశ్వరరావు, హుమాయూన్ బాషా, రవిశంకర్, వరలక్ష్మి, సుబ్బరాయుడు, ఖిజరలి, బి.వి రమణ, ఇలియాస్ భాష, ఉత్తేజ్ కుమార్ రావు న్యాయవాదులకు మద్దతుగా ప్రజా సంఘాల నాయకులు సిపిఐ విశ్వనాథ నాయక్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బండి ఈశ్వర్, బంజారా సంఘం శంకర్ నాయక్ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు.
రాయచోటి కోర్టు ప్రాంగణ సమీపంలో అంబేద్కర్ ప్లెక్సీ వద్ద నిరసన తెలియజేస్తున్న రాయచోటి న్యాయవాదులు.