కంపెనీ సభ్యుల బ్యాంకు అకౌంటు, ఆస్తి సీజ్ చేయాలని ఆదేశాలు
మీడియా సమావేశంలో డిఎస్పి మహబూబ్ బాషా
9 ఎఫ్ఎక్స్ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీని తిరుపతి పట్టణం వైకుంఠపురంలో నివాసం ఉంటున్న రసూల్ సాహెబ్, రైల్వే కోడూరుకి చెందిన యోగానంద చౌదరి, అనిల్ కుమార్ కలిసి ఎటువంటి అనుమతులు లేకుండా కంపెనీని ఏర్పాటు చేశారని అన్నమయ్య జిల్లా రాయచోటి డిఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. రాయచోటికి చెందిన సుబ్బారెడ్డి, తిరుపాల్ రెడ్డి,రాజేష్ ద్వారా 1759 డిపాజిట్ దారుల నుంచి 170 కోట్లు సేకరించారని ఆయన తెలిపారు. అంతేకాకుండా కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాలో కూడా ఈ కంపెనీకి చెందిన ప్రతినిధులు డిపాజిట్ దారుల నుంచి భారీగా వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఏప్రిల్ నెలలో ఈ కంపెనీని క్లోజ్ చేయడంతో మహమ్మద్ రఫీ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు రాజేష్, తిరుపాల్ రెడ్డి , సుబ్బారెడ్డి, రసూల్ సాహెబ్, యోగానంద చౌదరి, అనిల్ కుమార్ లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు. అదేవిధంగా నిందితుల బ్యాంకు అకౌంటు, ఆస్తులను సీజ్ చేయాలని బ్యాంకు మేనేజర్లకు, తాసిల్దారులకు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లకు లెటర్ పంపడం జరిగిందన్నారు. అదేవిధంగా కంపెనీలోని కంప్యూటర్ డేటాను కూడా సీట్ చేయడం జరిగిందన్నారు. తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోకుండా ప్రజలు కూడా జాగ్రత్త పడాలని డీఎస్పీ మహబూబాషా సూచించారు.