విజయవాడ, నవంబర్ 3: సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ శుక్రవారం జరిగింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించి మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. మొత్తం 38 ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. ఏపీలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు, 6790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రతిపాదన, ఏపీలో పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానానికి ఆమోదం తెలిపింది. కర్నూలులో నేషనల్ లా వర్శిటీకి మరో 100 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయించింది. జగనన్న సురక్ష కార్యక్రమానికి మంత్రి వర్గం అభినందనలు తెలిపింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని సీఎం జగన్ తెలిపారు. మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. అలాగే, పోలవరం నిర్వాసితుల ఇళ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్ కు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల మినహాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ పై రాయితీ ఇచ్చేందుకు నిర్ణయించింది. దీని వల్ల ప్రభుత్వంపై రూ.766 కోట్ల భారం పడనుందని, అయితే, 50 వేల మంది కార్మికులు దీనిపై ఆధార పడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ తెలిపింది. అలాగే, కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నంద్యాల, కడప జిల్లాల్లో ఎక్రెన్ ఎనర్జీకి 902 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 5,400 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకూ ఆరోగ్య శ్రీపై మరోసారి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే, క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్ ` 1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. పిడుగురాళ్ల మున్సిపాలిటీకి చెందిన ఎకరం భూమి తనఖాపైనా కేబినెట్ లో చర్చ జరిగింది. మున్సిపాలిటీలో రూ.8 కోట్ల రుణ సేకరణకు అనుమతించాలని కేబినెట్ కు పురపాలక శాఖ ప్రతిపాదనలు పంపింది.