దేశంలో దళితబంధు పుట్టించిన మొగోన్ని నేనే
దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు
సత్తుపల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
ఖమ్మం: దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్షాలపై విరుచుక పడ్డారు.ఇవాళ పెడబొబ్బలు పెట్టే మూడు రంగుల జెండాలు, ఎర్రెర్ర జెండాలు, పచ్చ పచ్చ జెండాలు.. ఏం చేశారండీ. ఒక్క సారి గుండె విూద చేయి వేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలి అని కేసీఆర్ సూచించారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్పా వారి గురించి ఆలోచించలేదు. దళితులకు అరచేతికి బెల్లం పెడుతా.. చక్కెర, చాకెట్లు ఇస్తానని చెప్పి అప్పటికప్పుడు ఎన్నికల ముందు మురిపించారు. మోసం చేశారు. దశాబద్దాల తరబడి ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. వాళ్ల నిజమైన శ్రేయస్సు గురించి ఆలోచించలేదు. వాళ్లను మనషులుగా గుర్తించలేదు అని కేసీఆర్ పేర్కొన్నారు.దళితబంధు పుట్టించిన మొగోడు ఎవరండి ఈ దేశంలో.. కేసీఆర్ అనేటోడు రాకముందు దళిత బంధు ఈ దేశంలో ఉండేనా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. దళితబంధు పెట్టినప్పుడు ఎన్నికలు లేవు. నన్ను ఎవరూ అడగలేదు. అదో పెద్ద విషాదగాధ. మన దేశానికే మాయని మచ్చ. యావత్ భారత సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. 75 ఏండ్ల కింద స్వాతంత్య్రం వస్తే నాడు దళితుల పరిస్థితి బాగా లేదు. యుగయుగాలు, తరతరాల నుంచి అణిచివేతకు, విక్షకకు గురయ్యారు. ఊరి నుంచి వెలివాడల్లో ఉన్నారు. అంటరాని వారు అని నిందలకు గురయ్యారు. మహాకవి జాషువా బాధపడి గాయపడి కావ్యాలు రాశారు. దళిత జాతి ఎందుకు అలా ఉండాలి. వాళ్లు మనషులు కారా.? మనలాగా పుట్టలేదా..? సాటి మానవులు కారా.? అని కేసీఆర్ నిలదీశారు.
సత్తుపల్లి ప్రజలు ఆలోచన శక్తి ఉన్న ప్రజలు
సత్తుపల్లి చైతన్యం , ఆలోచన శక్తి ఉన్న ప్రజలు. విూతో ఒకటే మాట మనవి చేస్తున్నా. ఎన్నికలు వస్తాయి, పోతాయి. పులయ్య ,మల్లయ్య గెలుస్తునే ఉంటరు. అది పెద్ద విషయం కానే కాదు. ఎవరు కాదన్నా అవున్నన్నా ఎవరో ఒకరు గెలుస్తరు. ఆలోచన చేయాలి. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులను కూడా చూడాలి. వారి చరిత్ర తెలుసుకోవాలి. వీరిని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. వీరి వెనుకాల ఉన్న పార్టీ చరిత్ర, దృక్పథం ప్రజల గురించి ఏం ఆలోచిస్తుందో తెలుసుకోవాలి. ఎవరో చెప్పారని ఓటు వేయడం కాదు. కులం వాడు నిలబడ్డాడని ఓటు వేయకూడదు. సొంత విచక్షణతో నిజనిజాల గురించి నిలబడి ఆలోచించి ఓటు వేయరో అప్పటి వరకు ప్రజాస్వామ్య పరిణితి రాదు. అలా ఆలోచించి ఓటు వేసిన దేశాల్లో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నాయి. ఆ చైతన్యం మన దేశంలో కూడా రావాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.