కడప, నవంబర్‌ 1:ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పలువురు అభ్యర్థులను మార్చేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఉమ్మడి కడపలో ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలన్న తలంపుతో టీడీపీ అభ్యర్థుల ఎంపికలో రకరకాల అర్హతలను పరిశీలిస్తోంది. ప్రధానంగా అర్థ బలం ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో విపరీతంగా ఖర్చు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం కూడా అందుకు దీటుగా సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో బరిలో దించబోయే అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వుడ్‌ నియోజకవర్గాలపైనా దృష్టి సారిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అధికార వైసీపీని దీటుగా ఎదుర్కొని మెరుగైన ఫలితాలు సాధించాలన్న వ్యూహంతో ఉన్న తెలుగు దేశం పార్టీ.. అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. కొన్ని చోట్ల గతంలో పోటీ చేసిన వారినే వచ్చే ఎన్నికల్లో బరిలో దింపే అవకాశాలు ఉండగా.. మరి కొన్ని చోట్ల కొత్త వారిని పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే జమ్మలమడుగులో కొత్త అభ్యర్థిగా భూపేష్‌ రెడ్డిని ప్రకటించగా, ప్రొద్దుటూరు, కడప అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్చార్జిలను ప్రకటించారు. దీంతో దాదాపు వీరే అభ్యర్థులుగా ఖరారవుతారని ప్రచారం సాగుతోంది. జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలైన బద్వేలు, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో కూడా ఆర్థిక అర్హతను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు చోట్ల కూడా పాత అభ్యర్థులతోపాటు కొత్తగా ఆశించే వారిని పరిశీలనలోకి తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో బద్వేల్‌ నుంచి డాక్టర్‌ రాజశేఖర్‌ పోటీ చేశారు. ఆయన అప్పట్లో ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా ఉన్నారు. ఆయన ఇప్పుడు మళ్లీ టికెట్‌ ఆశిస్తున్నప్పటికీ ఇంజనీరింగ్‌ డిపార్ట్మెంట్లో పని చేసిన రోషన్న అనే వ్యక్తిని అభ్యర్థిగా ఖరారు చేస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదే జరిగితే డాక్టర్‌ రాజశేఖర్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు.రైల్వే కోడూరులో అయితే గత ఎన్నికల్లో పంతగాని నరసింహ ప్రసాద్‌ దేశం అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో ఆయన ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో గట్టిగా పని చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఇద్దరు మహిళలు దీప్తి, రేవతి టికెట్‌ కోసం తెరపైకి వచ్చారు. వీరిలో ఒకరు ఆర్థికంగా స్థితిమంతులని సమాచారం. రిజర్వుడు నియోజకవర్గమైన ఇక్కడ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా స్థానిక కింగ్‌ మేకర్ల అభిప్రాయాలు కూడా ప్రధానమవుతాయి. ఈ నేపథ్యంలో రైల్వేకోడూరులో దేశం టికెట్‌ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *