విశాఖపట్టణ?ం, సెప్టెంబర్ 25: ఈ విజయదశమి నుంచే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించే దిశగా వైసీపీ సర్కార్ అడుగులు వేస్తోంది. విశాఖ రాజధాని అంశాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం చేపట్టే యోచనలోఉన్నట్లు తెలిపారాయన. ‘‘విశాఖ వందనం’’ పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అన్ని సమకూర్చుకున్న తర్వాతే విజయదశమి నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలనా ముహూర్తం ఖరారైందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.అంతకుముందు వీఎంఆర్‌డీలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని బిల్డింగ్‌ల ఎంపిక, సన్నద్ధతపై సీఎస్ చర్చించారు. విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ల అమలు కోసం కొన్ని సూచనలు చేశామని జవహర్ రెడ్డి తెలిపారు. నీతి ఆయోగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాలలో విశాఖ ఒకటి కావడం శుభ పరిణామమని.. 2047 వికసిత్ భారత్ కోసం ఎంపిక చేసిన నాలుగు నగరాలలో విశాఖ ఒకటని ఈ సందర్భంగా సీఎస్ ప్రస్తావించారు.అధికారికంగా దీనిపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ ప్రస్తుతం విశాఖలోని ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్ సవిూపంలో ఉన్న జీవిఎంసీ ఆఫీస్‌ను అరిలోవ సవిూపంలోని ముడసర్లోవకు తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ముడసర్లోవలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఇటీవల కమిషనర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు. అదే సమయంలో జీవీఎంసీ కార్యాలయాన్ని మునిసిపల్ అడ్మిన్‌కు కానీ లేదంటే ఏదైనా ఇతర ప్రభుత్వశాఖకు కేటాయించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో సిరిపురం జంక్షన్‌లో ఉన్న వీఎంఆర్డీఏ భవనంలో ప్రస్తుతం 4 అంతస్తులు ఖాళీగా ఉన్నాయి, వాటిలో పలు ప్రభుత్వ శాఖలకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో బీచ్ రోడ్‌లో సబ్ మెరైన్ మ్యూజియం సవిూపంలో 30వేల స్క్వేర్ యార్డ్స్‌లో స్మార్ట్ సిటీ భవనం, రుషికొండలో ఉన్న ఐటీహిల్‌లో ఏపీఐఐసీకి చెందిన మిలీనియం టవర్స్‌తో పాటు దాదాపు 2లక్షల చదరపు గజాల బిల్డింగ్ ఖాళీగా ఉంది. వీటిలో ఐటీ, ఇండస్ట్రీస్, ఇతర అనుబంధ శాఖలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కోసం కలెక్టరేట్ వెనుక కొత్తగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని కేటాయించనున్నట్లు సమాచారం.నివాగృహాల కోసం రుషికొండ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న అపార్ట్మెంట్లు, విల్లాలను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఆర్ కే బీచ్ రోడ్డు నుంచి రుషికొండ వరకు ఉన్న అపార్టుమెంట్లలో 150 ప్లాట్లను అద్దెకు తీసుకోవడానికి సిద్దం అయింది ప్రభుత్వం. టూరిజం, ట్రాన్స్పోర్ట్ మంత్రుల కార్యాలయాలు, అదే సమయంలో రెన్నొవెట్ చేస్తున్న జెడ్పీ గెస్ట్ హౌజ్‌ను పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖకు, బీచ్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న అతిథి గృహాన్ని పట్టణాభివృద్ధి శాఖకు, ఈఎన్సీ కార్యాలయంలో ఇరిగేషన్ మంత్రికి, సింహాచలంలో ఎండోమెంట్స్ మంత్రికి కార్యాలయాలు కేటాయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.