బెయిల్ వచ్చిన సందర్భంగా దివానే సాహెబ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
– తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు
– నియోజకవర్గ ప్రజలకు ఋణపడి ఉంటా : మండిపల్లి
రాయచోటి : పుంగనూరు, అంగళ్ళులో తనపై వైసీపీ ప్రభుత్వం బనాయించిన కేసులలో రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి హైకోర్టులో బెయిలు వచ్చిన సందర్భంగా రాయచోటి పట్టణంలోని యూసుఫ్ షా ఖాదిరి దివానే సాహెబ్ దర్గాలో చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అనంతరం మీడియా సమావేశంలో మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నాతోపాటు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర నేతలను వైసీపీ ప్రభుత్వం కక్ష్యపూరిత ధోరణితో అక్రమకేసులు బనాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 48 రోజులుగా నాకు బెయిల్ రావాలని కోరుతూ హిందూ, ముస్లిం మైనారిటీ మరియు క్రైస్తవ సోదరులు కులమతాలకు అతీతంగా మసీదుల్లో, దేవాలయాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు. అలాగే నాపై చూపిస్తున్న మీ అభిమానానికి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ఋణం తీర్చుకునే సమయం వచ్చింది. అలాగే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సోదరులతోపాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు పాల్గొన్నారు.