కోల్‌కతా ఘటనలో జూనియర్ వైద్యుల కోణం లోనూ, ప్రజల కోణంలోనూ చూస్తే, తమ తోటి స్టాఫ్ అయినా ఒక వైద్యురాలు అత్యంత వేదనాభరితంగా, నిస్సహాయ స్థితిలో లైంగిక దాడికి గురై ప్రాణాలను కోల్పోయింది. ఇది వైద్యులూ, ప్రజలూ జీర్ణం చేసుకోలేకపోతున్నారు. పోలీసుల నుండి, ప్రభుత్వం నుండి మానవత్వంతో కూడిన స్పందన రావాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా కొన్ని ప్రయత్నాలు జరగడం జూనియర్ వైద్యులకూ, తీవ్రమైన దిగ్బ్రాంతిని కలిగించాయి. సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ని సస్పెండ్ చేయాల్సింది. కానీ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయకుండా మరో మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా బదిలీ చేసింది. దాంతో పాటు, బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని ఆత్మహత్య కథనాలు అల్లి శవ దహనం కూడా వీలైనంత వేగం చేయించేసి డబ్బు ఆశ కూడా చూపించే ప్రయత్నాలు జరిపించడం పట్ల జూనియర్ వైద్యులకు విపరీతమైన కోపం ఉంది. అత్యాచారాలకు వ్యతిరేకంగా బలమైన చట్టం చేసినంత మాత్రాన ఇవి పరిష్కారం కావు. తమ డిమాండ్లు నెరవేరే వరకు, బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ‘ ‘‘కోల్‌కతా పోలీస్ కమిషనర్, రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లను తొలగించాలి’’ అని వారు డిమాండ్ చేశారు.మహిళలను గౌరవించే సామాజిక, సాంస్కృతిక విప్లవం నిరంతరం జరగాలి.ప్రభుత్వం కోణంలో చూస్తే, వైద్యులు హాస్పిటల్‌కి చాలా అవసరం. పేదలే ప్రభుత్వాసుపత్రులకు వస్తారు. డబ్బున్న వారూ, మధ్యతరగతీ సాధారణంగా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. జూనియర్ వైద్యుల సమ్మె హాస్పిటల్ సేవలో సమస్యలను తెచ్చి పెట్టింది. రోగులు సరైన ట్రీట్మెంట్ లేక నిస్సహాయ స్థితిలో పడిపోవడం కూడా జరుగుతుంది. ఓపిడీలలో సరైన ట్రీట్మెంట్ దొరకడం లేదు. ఈ కారణాలన్నీ చూపిస్తూ, ప్రభుత్వం జూనియర్ వైద్యుల్నీ, మెడికల్ ట్రైనీలనూ వెంటనే తమ పనుల్లో చేరమని అభ్యర్థిస్తోంది. ఇక ప్రభుత్వం తరఫున వాదన ఏమిటంటే, పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. సీబీఐ తన పని తాను చేసుకుంటోంది. కోర్టుల ఆధ్వర్యంలో కేసు నడుస్తోంది. మహిళల విూద అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం శాశ్వత పరిష్కారాల కోసం అపరాజిత చట్టాన్ని కూడా వీలైనంత తక్కువ సమయంలో తీసుకొచ్చింది. మహిళల సెక్యూరిటీ కోసం పాలనా పరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంది. మహిళా పోలీసుల్ని రాత్రి వేళల్లో నియమించబోతోంది.దాదాపు 7,000 మంది మూక ఆగస్టు 14 రాత్రి హాస్పిటల్ విూద పడి జూనియర్ వైద్యులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇదంతా కూడా పాలనా యంత్రాంగం ఆశీర్వాదం లేకుండా జరుగుతుందా ? అన్న ప్రశ్న జూనియర్ వైద్యులకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా వస్తోంది. అందుకే, జూనియర్ వైద్యులు సంబంధిత ప్రిన్సిపల్‌ని సస్పెండ్ చేయమని కోరుతున్నారు. అలానే, పూర్తిగా వైఫల్యం చెందిన పోలీస్ కమిషనర్‌ను కూడా తొలగించమని కోరుతున్నారు. దాంతో పాటు బాధితురాలికి జరిగిన అన్యాయం పట్ల సరైన న్యాయబద్ధమైన పరిష్కారం కోరుతున్నారు. ప్రభుత్వం నుండి సంతృప్తికరమైన సమాధానం రానంతవరకు సమ్మె ఆగేది లేదని జూనియర్ వైద్యులు చెబుతున్నారు. ఈ రెండు ఇలా ఉంటే, దగ్గర్లో దుర్గా పూజా కారణంగా అతిపెద్ద మార్కెట్ మిస్ చేసుకుంటున్న వ్యాపార వర్గాలు అత్యంత ఆందోళనలో ఉన్నాయి. దుర్గా పూజ ఒక పూజ మాత్రమే కాదు. కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం. ఈ వర్గం కూడా అత్యంత ఆవేదనలో ఉంది. ఈ వ్యాపారం విూద ఎన్నో వేలమంది ఉపాధి కోసం ఆధారపడి ఉన్నారు. అందుకే ఈ వర్గం కూడా కోపంతో ఉంది.సుదీర్ఘ కాలంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ పార్టీ ఉన్నా సరే అనైతిక శక్తులు, అవినీతికర శక్తులు ఆ పార్టీలో ప్రవేశించడం, ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగించడం మనకు తెలిసిందే. నేడు బెంగాల్లో కూడా అదే కనిపిస్తుంది. ఉపాధ్యాయుల నియామకం విషయంలో విపరీతమైన అవినీతి ఇంతకుముందు చూశాం. అప్పుడైనా సరే, పాలకవర్గం జాగ్రత్త పడాల్సింది. దాంతో పాటు హాస్పిటల్లలోనూ, రోడ్లవిూద పర్మనెంటు పోలీసుల నిర్వహణ తగ్గి, కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డ్స్ నియామకం పెరిగింది. సివిక్ వాలంటీర్ల నియామకం పెరిగింది. వీరి జీతాలు చాలా తక్కువ. ఒక పెద్ద మెడికల్ కాలేజ్ పర్మనెంట్ పోలీసుల నిర్వహణలో ఉండడం వేరు. చూసీ చూడని కాంట్రాక్టు గార్డుల నియామకంలో, నిర్వహణలో ఉండడం వేరు. మన పాలకవర్గాలు చాలా రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితాలను అలవాటు చేసి ప్రజల్లో ప్రశ్నించే స్వభావం, నిరసించే గుణం తగ్గించేశారు. ఇలాంటి ప్రజావ్యతిరేక ఆర్థిక విధానాలు ప్రపంచ బ్యాంకు సలహాలతో ముందుకు నడుస్తాయి. కాబట్టి, మనం వుయ్ వాంట్ జస్టిస్ అన్నప్పుడు ఒకవైపు బాధితురాలికి సరైన న్యాయం అందాలి. మరోవైపు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి హాస్పిటల్లోనూ సెక్యూరిటీలో కాంట్రాక్టు ఉద్యోగులను పూర్తిగా తగ్గించి పర్మనెంట్ పోలీసుల చేతుల్లోకి వెళ్లాలి. అందుకోసం, పోలీసుల నియామకాలు యుద్ధ ప్రాతిపదికన జరగాలి.మహిళల విూద అత్యాచారాలకు వ్యతిరేకంగా బలమైన చట్టం చేసినంత మాత్రాన ఇవి పరిష్కారం కావు. ప్రజా వ్యతిరేక విధానాలను తొలగించి, ప్రజానుకూల విధానాలు రావాలి. అలానే, ప్రజల్లో సామాజిక, సాంస్కృతిక చైతన్యం పెరగాలి. మహిళల పట్ల చులకన భావం, మహిళలని అవమానించే భాష వాడకం తగ్గాలి. అవతలి మహిళను గౌరవించే సంస్కృతి పెరగాలి. అందుకు నిరంతరంగా సాంస్కృతిక రంగంలో మార్పు జరగాలి. అలానే, మన సినిమాల్లో హీరోల ప్రవర్తన హీరోయిన్ పట్ల అత్యంత చులకన భావంతో ఉంటుంది. వాడే భాష కూడా అలాగే ఉంటుంది. దాన్నే బాగా ప్యాక్ చేసి ఒప్పించే తప్పుడు విలువలు అత్యంత ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇలాంటి సినిమాలు చూడకుండా నిరసన తెలియజేయడం కూడా రావాలి. ఇలా సామాజిక, సాంస్కృతిక విప్లవం నిరంతరం జరగాలి. అప్పుడే వుయ్ వాంట్ జస్టిస్ ఉద్యమానికి న్యాయం జరుగుతుంది.