ప్రపంచానికి మంకీపాక్స్ కొత్త సవాల్ విసురుతోంది. ఆఫ్రికా దేశాల్లో హఠాత్తుగా కేసులు పెరిగిపోవడం, మిగిలిన దేశాలకు కూడా ఇది చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ ఈ తరహా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి. 2022లో కూడా మంకీ పాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఎం`పాక్స్‌గా పిలిచే మంకీ పాక్స్ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపించడంతో అటు ఆఫ్రికా దేశాలతో పాటు ఇటు ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి.కరోనా తర్వాత అంతటి రేంజ్ లో భయానకంగా ఈ వ్యాధి మారింది. మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ తెలిపిన లెక్కల ప్రకారం జనవరి నుంచి ఆఫ్రికాలో ఎంపాక్స్ కేసులు 18,737కు చేరినట్లు, మృతుల సంఖ్య 541కు చేరినట్లు తెలుస్తోంది. తొలుత ఆఫ్రికాకే పరిమితమైన ఈ ప్రాణాంతక వైరస్ క్రమంగా ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తోందని, అప్రమత్తంగా లేకుంటే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చిఊూ హెచ్చరికలు జారీ చేసింది. గతంలో కూడా మంకీపాక్స్ వైరస్ వెలుగు చూసినప్పటికీ ఈసారి మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది . ఆఫ్రికా దేశాలతో పాటు మన పక్క దేశం పాకిస్థాన్‌లోనూ ఎంపాక్స్ కేసులు గుర్తించినట్లు చిఊూ ప్రకటించడంతో టెన్షన్ మరింత ఎక్కువైంది.మంకీ పాక్స్ వ్యాధి ఆఫ్రికా దేశాల్లో దశాబ్దాలుగా ఉంది. మరీ ముఖ్యంగా కాంగో దేశంలో ఈ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. 1970లో తొలిసారి ఈ వ్యాధి ఆ దేశంలో వెలుగుచూసింది. కాంగోకు చెందిన 9 నెలల బాలుడికి మంకీ పాక్స్ సోకినట్లు నిర్ణారణ అయ్యింది. ఇది ప్రపంచంలో ఓ మనిషికి సోకిన తొలి మంకీ పాక్స్ వైరస్ కేసు. వాస్తవానికి పరిశోధనల కోసం తీసుకొచ్చిన కోతుల్లో మొట్టమొదటిసారి ఈ వ్యాధిని 1958లో డెన్మార్క్‌లో గుర్తించారు. అందుకే దీనికి మంకీ పాక్స్ అని పేరు పెట్టారు. మంకీపాక్స్ కేసు 2022లో మన దేశంలో కేరళలో కూడా ఒకటి నమోదైంది. జంతువుల నుంచి మనిషికి.. మనిషి నుంచి మనిషి ఈ వైరస్ వ్యాపిస్తుంది. కోతులు, ఉడతలు, ఎలుకలు కొరకడం, గోళ్లతో గీకడం, వాటికి దగ్గరగా ఉండటం, లేదా సరిగ్గా ఉడకకుండా వాటిని తినడం ద్వారా ఈ వైరస్ వాటి నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా దేశాల్లో తొలినాళ్లలో వేటగాళ్లు ఎక్కువగా ఈ వైరస్ బారినపడినట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.దశాబ్ధాలుగా మంకీ పాక్స్ వస్తూ పోతూ కాంగో సహా ఆఫ్రికా దేశాల్లో జనానికి ప్రత్యక్ష నరకం చూపుతోంది. పాత వ్యాధి కొత్త రూపు సంతరించుకొని ఇప్పుడు యావత్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కాంగోలో 27వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 1100 మరణాలు సంభవించాయి. మంకీపాక్స్ అనే వైరస్ నుంచి ఈ వ్యాధి ప్రబలుతోంది. ఈ కేసులు పెరుగుతుండటంతో ఇది కూడా కోవిడ్ తరహాలో ప్రాణాంతకంగా మారే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం మనిషి నుంచి మనిషికి ఈ ఎం పాక్స్ వైరస్ అత్యంత వేగంగా విస్తరించడం యావత్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. గర్భిణి మహిళ ఈ వైరస్ బారినపడితే.. గర్భాశయంలోని శిశువుకు కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశముంది. సెక్స్ కారణంగా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. అయితే వైరస్ బారినపడి చర్మపు పగుళ్లు ఉండిన వ్యక్తితో మరో వ్యక్తి చర్మం రాపిడి జరిగితే వైరస్ వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వాపుతో పాటు చీము నిండిన పొక్కులు ఎంపాక్స్ వైరస్ సోకిన వ్యక్తుల్లో సాధారణ లక్షణాలుగా కనిపిస్తాయి. ఈ పొక్కులు ముఖంపై మొదలై క్రమంగా శరీరమంతా విస్తరిస్తున్నాయి. సాధారణంగా ఈ పరిస్థితి రెండు నుంచి నాలుగు వారాలు ఉంటోంది. ఏ చికిత్స తీసుకోకున్నా అది తగ్గిపోతుంది కానీ.. ఆ తర్వాత దాని వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో అది ఏకంగా మరణానికీ దారితీస్తుండటం ఆందోళన కలిగించే అంశం. మరీ ముఖ్యంగా రోగనిరోధకశక్తి తక్కువ ఉండేవాళ్లు, అప్పటికే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వైరస్ బారిన పడితే ఇక కోలుకోవడం కష్టంగా మారుతోంది.కొన్నేళ్లుగా ఆఫ్రికా దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ వ్యాధి.. ఇప్పుడు ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాధి ప్రభావం 116 దేశాలపై ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 15,600 మంకీ పాక్స్ కేసులు నమోదవ్వగా 537 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు తూర్పు, పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో ఉన్న ఎం`పాక్స్ ఇప్పుడు అమెరికా, యూరోప్‌కు కూడా వ్యాపించింది. స్వీడన్, పాకిస్థాన్ దేశాల్లోనూ తొలి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే భారత్‌లో ప్రస్తుతం ఈ కేసులు ఏవీ నమోదుకాలేదు.ప్రస్తుతం ఈ వ్యాధికి ఎటువంటి చికిత్స లేదు. లక్షణాలను బట్టి చికిత్స అందించడం ప్రస్తుతానికి ఉన్న మార్గం. స్మాల్ పాక్స్ కోసం రూపొందించిన మూడు వ్యాక్సిన్స్ మంకీపాక్స్ నివారణకు కూడా కూడా ఆమోదించారు. అయితే వీటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ధృవీకరించలేదు. ఇప్పుడు ఎం`పాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడంతో దీనిపై పరిశోధనకు, వైద్య సాధనాల అందుబాటు పెంచేందుకు నిధుల వెసులుబాటు పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎం పాక్స్ కేసులతో ప్రపంచ దేశాలు అలెర్ట్ అయ్యాయి. ఇతర దేశాల నుంచి తమ దేశానికి ఈ వైరస్ సోకకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. మంకీ పాక్స్ కేసులతో అప్రమత్తమైన చైనా.. తమ దేశానికి వచ్చేవారికి స్క్రీనింగ్ టెస్టులు చేస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తరహాలోనే మంకీ పాక్స్ వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. మంకీపాక్స్‌ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో హై లెవల్ రివ్యూ నిర్వహించారు. రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలను అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.