బద్వేలు: రాయలసీమ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం గత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 1600 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయించిన గోపవరం సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీలో 70% ఉద్యోగాలు స్థానికులకు కేటాయించాలని గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ బందెల ఓబయ్య డిమాండ్ చేశారు. బద్వేల్ లో స్థానిక ఆర్డిఓ ఆఫీస్ కార్యాలయం ముందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బందెల ఓబయ్య మాట్లాడుతూ, 1600 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన 850 ఎకరాల భూమిని గోపవరం మండల ప్రజల నుండి సేకరించి, 105 ఎకరాలలో ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉత్పత్తి ప్రారంభమవుతే ప్రత్యక్షంగా 2000 మందికి పరోక్షంగా నాలుగువేల మందికి ఉపాధి దొరుకుతుందని, అందులో మొదటి ప్రాధాన్యత రాయలసీమ వాసులకు దక్కుతుందని ఆశపడ్డామన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న వారిలో రాయలసీమ నిరుద్యోగులకు మొండిచెయ్యి మిగిలింది అన్నారు.భూమిని సేకరించే క్రమములో కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానని ఆనాడు జగన్మోహన్ రెడ్డి హావిూ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు.. అయితే ఈనాటికి ఫ్యాక్టరీలో 1000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 200 మంది కూడా స్థానికులు లేకపోవడం విస్మయానికి గురి చేసిందని ఆవేదన చెందారు. భూమిని కోల్పోయిన దళితులకు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారందరూ కలకత్తా ,గుజరాత్, రాజస్థాన్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారు అధికంగా ఉన్న కారణంగా స్థానికులకు అవకాశం లేకుండా పోయిందని అన్నారు.. రాయలసీమ ప్రాంతంలో పట్టుమని వెయ్యి మంది పని చేసే ఒక ఫ్యాక్టరీ కూడా లేదని,ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయి ఉన్న సమయములో బద్వేల్ ప్రాంతానికి ప్లైవుడ్ ఫ్యాక్టరీ రావడము ఆనందదాయకం అయినప్పటికీ, ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు దొరకకపోవడం బాధ కలిగిస్తుందని అన్నారు. ఏప్రిల్ 20వ తేదీ లోపల ఇతర రాష్ట్రాల వారినందరినీ తొలగించి మొత్తం ఉద్యోగాలలో 70 శాతం రాయలసీమ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, లేనిపక్షంలో భూమిని కోల్పోయిన వారితో పాటు ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ ఏకం చేసి గోపవరం సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరము స్థానిక ఆర్డీవో కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమములో గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక బద్వేల్ ఏరియా కార్యదర్శి కే.జకరయ్య, పట్టణ కార్యదర్శి కె. బాబులతోపాటు రామరాజు, చంద్రపాల్,సుబ్రహ్మణ్యం నారాయణ, పాండు, మోహన్, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.