కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు ముప్పు.. అందుకే బీఆర్ఎస్తో పొత్తు
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ మార్చ్ 5: కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు ముప్పు ఉందని, అందుకే బీఆర్ఎస్తో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సమావేశం ముగిసిన అనంతరం ప్రవీణ్ కుమార్ విూడియాతో మాట్లాడారు.ఈ రోజు కేసీఆర్ను కలిసినందుకు ఆనందంగా ఉంది. సెక్యులరిజం ప్రమాదంలో ఉన్నది. ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంది. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కూడా కుట్ర చేస్తోంది. లౌకికత్వాన్ని నిరంతరం కాపాడిన కేసీఆర్తో కలిసి.. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. మాయావతి ఆశీస్సులతో ముందుకు వెళ్తాం. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ముప్పు నుంచి తెలంగాణను కాపాడేందుకు బీఆర్ఎస్తో కలిసి పని చేయాలని నిర్ణయించాం. తప్పకుండా సీట్ల సర్దుబాటు చేసుకుని తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. మాయావతితో కూడా తప్పకుండా మాట్లాడుతారు కేసీఆర్. తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది ఈ స్నేహం. బహుజన వర్గాల జీవితాలు తప్పకుండా బాగుపడుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలు అవుతోంది. ఈ ప్రభుత్వం పట్ల నిరుద్యోగులు సంతోషంగా లేరు. నిరుద్యోగులు రోడ్ల విూదకు వచ్చే పరిస్థితి ఉంది. ఐకమత్యంగా ఉంటాం. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని మాకు నమ్మకం ఉంది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.