బెంగళూరు, నవంబర్‌ 15: ర్ణాటకలోని రైతులు తమకు వధువుల కోసం మాండ్యలోని ఒక పుణ్యక్షేత్రానికి పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. యువతులు , వారి కుటుంబాలు గ్రావిూణ జీవితాన్ని స్వీకరించడానికి ఇష్టపడకపోవడమే ఈ యువ రైతులకు పెళ్లిళ్లు కాకపోవడానికి కారణంగా తేలింది. దీనికి వధువుల కొరతకు కారణమని వారు నమ్ముతున్నారు. ఈ అంశంపై అవగాహన కల్పించడంతోపాటు రైతుల ఆశయాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు వారంతా సిద్ధమయ్యారు. అందుకే ‘వధువు’ కోసం పాదయాత్ర చేపట్టారు. ఈ పరిణామం సమాజంలోని ధోరణి.. వధువు సంక్షోభం యొక్క తీవ్రతను హైలైట్‌ చేస్తోంది.అఖిల కర్ణాటక బ్రహ్మచారిగల సంఘం ఆధ్వర్యంలో మాండ్యాకు చెందిన అవివాహిత పురుషులు ఆదిచుంచనగిరి మఠానికి డిసెంబర్‌లో పాదయాత్ర నిర్వహించడానికి సిద్ధమయ్యారు. రైతుగా పనిచేస్తున్న తమకు తగిన వధువులు కావాలనే ఆశతో వచ్చే నెలలో మాండ్యలోని ఒక పుణ్యక్షేత్రానికి పాదయాత్ర చేపట్టేందుకు కర్ణాటకలోని రైతులు పెద్ద సంఖ్యలో సిద్ధమవుతున్నారు.గ్రామాల్లో వ్యవసాయం చేసే యువకులకు పిల్లను ఇవ్వడానికి తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. యువతులు కూడా గ్రామాల్లో రైతులను చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. మంచి ఉద్యోగం ఉంటేనే.. పట్టణాల్లో అయితేనే పెళ్లి చేసుకుంటామని అంటున్నారు. దీంతో యువ రైతులకు పెళ్లిళ్లు కావడం కానకష్టమైపోయింది. 30 ఏళ్లు వచ్చినా వారికి పెళ్లిళ్లు కాక ముదురు బెండకాయలు అయిపోతున్నారు.‘‘మేము కట్నం కోరడం లేదు. మేము కాబోయే వధువులను రాణుల వలె చూసుకుంటాం. అయితే ఏ కుటుంబం కూడా వారి కుమార్తెలను మాకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. సమాజంలో ఈ సమస్యపై అవగాహన పెంచేందుకు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నాం. డిసెంబరులో అఖిల కర్ణాటక బ్రహ్మచారిగల సంఘం ఆధ్వర్యంలో మండ్యకు చెందిన అవివాహితులు ఆదిచుంచనగిరి మఠానికి పాదయాత్ర చేపట్టనున్నారు. యాత్రకు అంగీకారం తెలిపిన ఆదిచుంచనగిరి దర్శి నిర్మలానందనాథ స్వామిని కలిశాం.. వధువు సంక్షోభంపై సమాజంలో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం’ అని ఆ సంఘ వ్యవస్థాపకులు, యువ రైతు కె.ఎం.శివప్రసాద్‌ తెలిపారు.ఈ పాదయాత్రల ద్వారా తమకు తగిన జీవిత భాగస్వాములను కనుగొనడంలో ఎదురవుతున్న సవాళ్లను అందరిదృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారం సాగాలని రైతులు భావిస్తున్నారు. తమను పెళ్లి చేసుకునే వధువులను అత్యంత గౌరవంగా.. శ్రద్ధతో చూసుకునేందుకు కట్టుబడి ఉన్నామని, వారి ఉద్దేశాల గురించి ఏవైనా అపోహలు ఉంటే తొలగించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా స్థానిక సమాజానికి.. మత, కుల పెద్దలకు సమస్య యొక్క తీవ్రతను తెలియజెప్పుతామన్నారు. ఈ వధువు సంక్షోభాన్ని పరిష్కరించడానికి సమిష్టి కృషి యొక్క అవసరాన్ని హైలైట్‌ చేయాలన్నదే తమ ఉద్దేశమని యువ రైతులు అంటున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *