విజయవాడ, అక్టోబరు 28: ఏపీలో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ మేరకు రీజనల్ పాస్ పోర్ట్ అధికారి శివహర్ష శనివారం అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి అదనంగా బందరు రోడ్డులో ఈ రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.రీజనల్ పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి రోజుకు 2 వేల దరఖాస్తులు వస్తున్నాయని, కొవిడ్ తర్వాత పాస్ పోర్ట్ కోసం అప్లై చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని పాస్ పోర్ట్ అధికారి శివహర్ష తెలిపారు. అక్టోబర్ వరకూ 3 లక్షల పాస్ పోర్టులు జారీ చేశామని చెప్పారు. పోస్టల్, పోలీస్ శాఖల భాగస్వామ్యంతో పాస్ పోర్ట్స్ త్వరితగతిన అందిస్తున్నామని వివరించారు. విజయవాడ రీజనల్ ఆఫీస్ కేంద్రంగానే ఇకపై పాస్ పోర్ట్ ప్రింటింగ్ ప్రారంభమవుతుందన్నారు. మరో 2, 3 నెలల్లోనే రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం పాస్ పోర్ట్ సేవలు సులభతరం చేశామని, తక్కువ సమయంలోనే అప్లై చేసిన వారికి అందిస్తున్నామని అన్నారు. ఫేక్ సైట్స్, బ్రోకర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ నమ్మొద్దని సూచించారు.