న్యూ డిల్లీ అక్టోబర్‌ 16: ఇజ్రాయెల్‌ ? హమాస్‌ యుద్ధంపై అమెరికా తన వైఖరి మార్చుకుంది. హమాస్‌ దాడులు ప్రారంభం కాగానే ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం పూర్తి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులను శత్రువులెవరూ ఉపయోగించుకోవద్దని హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో హమాస్‌తో పోరాడటానికి ఇజ్రాయెల్‌కు బైడెన్‌ అన్నిరకాలుగా సహాయ సహకారాలూ అందిస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు ఉన్నట్టుండి బైడెన్‌ మాట మార్చారు.గాజాపై భూదాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్‌కు బైడెన్‌ తాజాగా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. గాజా స్ట్రిప్‌ ను ఆక్రమించొద్దంటూ ఆ దేశ (ఇజ్రాయెల్‌) అధ్యక్షుడిని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌లో హమాస్‌ దాడుల కారణంగా ఇప్పటి వరకూ మొత్తం 1400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అందులో 30 మందిదాకా అమెరికన్‌ పౌరులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో సీబీఎన్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్‌ మాట్లాడుతూ.. గాజా స్ట్రిప్‌ను పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవడాన్ని తాము సమర్థించబోమని స్పష్టం చేశారు. గాజాను ఆక్రమించడం చాలా పెద్ద తప్పే అవుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.‘గాజాలో ఏం జరుగుతోందో నా కోణంలో చెప్పాలంటే.. అక్కడి పాలస్తీనా ప్రజలందరికీ హమాస్‌ ఉగ్రవాద సంస్థ ప్రాతినిథ్యం వహించదు. కాబట్టి గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్‌ మళ్లీ ఆక్రమించుకుంటే అది పెద్ద తప్పే అవుతుంది. ఇజ్రాయెల్‌ యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్లదని నేను విశ్వసిస్తున్నాను’ అని బైడెన్‌ వ్యాఖ్యానించారు. అయితే, ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరిపారేయాల్సిన అవసరం చాలా ఉందని బైడెన్‌ అభిప్రాయపడ్డారు.
ఇరాన్‌ హెచ్చరికలు:
గాజాపై బాంబు దాడులు ఆపకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌ను ఇరాన్‌ హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ద్వారా ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ ఓ ప్రైవేటు సందేశం పంపిందని జెరూసలేం పోస్టు ఆదివారం వెల్లడిరచింది. గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం బాంబు దాడులు ఆపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్‌ అందులో హెచ్చరించింది. ఐరాస సమన్వయకర్త టోర్‌ వెన్నెస్‌ల్యాండ్‌ను ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్‌ లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో కలిసారు. యుద్ధ పరిస్థితిపై చర్చించారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *