కడప, అక్టోబరు 13: మరో ఐదారు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజంపేటపై రాజులు గురి పెట్టారు. ఇద్దరు క్షత్రియ నేతలు రాజంపేట టికెట్ రేసులో ఉన్నారు .ఇద్దరిలో ప్రముఖ రాజు విద్యా సంస్థల అధినేత జగన్మోహన్ రాజు టీడీపీ నుంచి టికెట్ రేసులో ఉండగా జనసేన నుంచి తన పదవికి స్వచ్ఛంద విరమణ చేసిన ప్రభుత్వ అధికారి వై శ్రీనివాస్ రాజు టికెట్ రేసులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ చంగల్ రాయుడుతోపాటు జగన్ మోహన్ రాజు టికెట్ కేసులో నువ్వా, నేనా అన్నట్లు ప్రయత్నాలు సాగిస్తున్నారు. జనసేన నుంచి శ్రీనివాసరాజుతోపాటు మరో యువ నాయకుడు అతికారి దినేష్ అనే నాయకుడు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీలలో ఎవరికి టికెట్ దక్కుతుందనేని ఆసక్తిగా మారింది.
జగన్మోహన్ రాజు రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నిరంతరం శ్రమిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.అదే సమయంలో జగన్‌మోహన్‌రాజు గత ఎళ్లగా రాజంపేట నియోజవర్గ ప్రజలకు తలలో నాలుకలా ఉన్నారు.నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధాలను ప్రజల్లోకి తీసుకెలుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు అక్రమం అంటూ వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. సామాజిక,ఆర్థికంగా బలమైన నేతగా,సౌమ్యుడిగా జగన్‌మోహన్‌రాజుకు పేరుంది. గతంలో టికెట్ ఆశించినా దక్కకపోవడంతో ఈ సారి టిక్కెట్ విషయంలోను,గెలుపు విషయంలోనూ జగన్‌మోహన్‌రాజు నమ్మకంతో ఉన్నారు .ఇక జనసేన టికెట్ ఆశిస్తున్న శ్రీనివాసరాజు కడప జిల్లాలో డీఆర్డీఏలో వివిధ స్థాయిలో పని చేస్తూ గుర్తింపు పొందారు. ఆయన సొంత నియోజకవర్గం రాజంపేటలో నందలూరు మండల జెడ్పీటీసీగా ఆయన సోదరుడు శివరామరాజు గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి దేశం పొత్తులో టికెట్ ఆశిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ప్రయత్నాలు సాగిస్తున్నారు.టీడీపీ, జనసేన నుంచి కాపు సామాజిక వర్గం నేతలు చంగల్ రాయుడు, దినేష్, మరోవైపు క్షత్రియ సామాజిక వర్గం నేతలు జగన్ మోహన్ రాజు, శ్రీనివాసరాజు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో ఈ సారి రాజులను టికెట్ వరిస్తుందని అంటున్నారు. తెలుగుదేశంగానీ, జనసేనగానీ రాజులకు రాజంపేటలో టికెట్ కేటాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఆ కమ్యూనిటీ ఓట్లు ఆయా పార్టీలకు సానుకూలంగా మారుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున జగన్మోహన్ రాజు, జనసేన నుంచి శ్రీనివాసరాజులు టికెట్ రేసులో ఉన్నారు. మరి ఈ సారి రాజులకు టికెట్ ఇవ్వాలనుకుంటే టికెట్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.