విజయవాడ, సెప్టెంబర్ 14: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రసంగాల్లో ఆమెదైన శైలి ఉంది. కొన్ని సార్లు ఆమె ప్రసంగాలు విూమర్స్ కు కావాల్సింత పని కల్పిస్తూంటాయి. పాదయాత్ర అంటే పాదాలపై నడిచే యాత్ర .. రెయినీ సీజన్ అంటే వర్షాలు పడే సీజన్ అనే నేరేటివ్స్ వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఆమె ప్రభుత్వంపై కానీ.. వైసీపీపై కానీ.. జగన్ పై కానీ విమర్శలు చేయడంలో ప్రత్యేకత చూపిస్తారు. ఇటీవలి కాలంలో ఆమె ప్రభుత్వం కన్నా వైసీపీ అధినేత జగన్ నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే ముందు జగన్ అంత అంత కంటే ఘోరం చేశారని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన షర్మిల ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేశారు. గత సీఎం జగన్ లా రైతులకు అన్యాయం చేయవద్దన్నారు. షర్మిల విమర్శల్లో ప్రభుత్వానికి డిమాండ్లు ఉంటాయి. కానీ జగన్ పై విమర్శలు ఉంటున్నాయి. ఆయన ఐదేళ్ల కాలంలో అత్యంత దుర్భరమైన పాలనను ప్రతి అంశంలో అందించారని.. ప్రజలను అష్టకష్టాలు పెట్టారని గుర్తు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సాధారణంగా అయితే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తాయి. కానీ షర్మిల వైసీపీని.. ఆ పార్టీ అధినేతను టార్గెట్ చేసుకుంటున్నారు. అందుకే.. వైసీపీ నేతలకు షర్మిల రాజకీయం కాస్త ఇబ్బందికరంగా మారుతోంది. తమను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె టీడీపీతో చేతులు కలిపారని విమర్శలు కూడా చేస్తూంటారు. షర్మిల రాజకీయ విమర్శల వెనుక ప్రత్యేకమైన వ్యూహం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. వైసీపీని, జగన్ ను ఎంత బలహీన పరిస్తే తాను అంత బలపడతానని తెలుసు కాబట్టి చాన్స్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. షర్మిల ముందు ముందు తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. జగన్ కాంగ్రెస్ కు దగ్గర అయితే షర్మిల ఎక్కువ ఇబ్బంది పడతారు. సోదరుడితో వచ్చిన విబేధాల వల్లనే రాజకీయంగా వేరు అయ్యారు. ఇప్పుడు మళ్లీ కలిసి పని చేసే అవకాశం ఉంది. పాత వివాదాలన్నీ సెటిల్ చేసుకున్నా.. సరే తన రాజకీయ భవిష్యత్ ను త్యాగం చేసేందుకు షర్మిల సిద్ధంగా ఉండే అవకాశం ఉండదు. అందుకే జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు రాకుండా ఉండేందుకు మరింత ఎక్కువగా ఎదురుదాడి చేస్తున్నారని భావిస్తున్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో జగన్ కేసులు ఓ కొలిక్కి వస్తాయని.. తర్వాత వైసీపీ పరిస్థిథి మరింత దిగజారిపోతుందని చెబుతున్నారు. అదే జరిగితే.. బలపడేది కాంగ్రెస్ పార్టీనే కదా అనేది ఆమె ఉద్దేశం కావొచ్చని చెబుతున్నారు.