విజయవాడ, సెప్టెంబర్ 12: ఏపీలో వరద చుట్టూ పొలిటికల్ వార్నింగ్ లు పెరుగుతున్నాయి. చంద్రబాబు వర్సెస్ జగన్ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. విజయవాడ వరదలకు విూరంటే విూరే కారణమని ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. వరదల నుంచి జనం దృష్టి మళ్లించడానికే తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారన్నది జగన్ వాదన. ఎప్పటికీ టీడీపీ ప్రభుత్వమే ఉండదని, తాము వచ్చాక టీడీపీ నేతలు కూడా అదే జైలుకు వెళ్లడం ఖాయమని వార్నింగ్ లు ఇస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీలోకి బోట్లు కొట్టుకొచ్చిన ఘటనపైనా డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రకాశం బ్యారేజ్ లోకి గేట్లు కొట్టుకొచ్చిన ఘటనపై సీఎం, మాజీ సీఎం మధ్య డైలాగ్ వార్. ఈ ఘటనకు విూరంటే విూరే కారణమన్న వాదన వినిపిస్తున్నారు. బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయని, ఈ కుట్ర కోణం వెనుక ఎవరు ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అంటున్నారు. అయితే టీడీపీ విజయోత్సవాల్లో ఈ బోట్లు పాల్గొన్నాయని ఆ బోటు యజమానులు టీడీపీ నేతలకు దగ్గరి వారే అని జగన్ అంటున్నారు. మొత్తంగా వరదల వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారాయి.పదిన్నర లక్షల కోట్ల అప్పు చేసి జగన్ గద్దె దిగిపోయాడని, వచ్చి ఈ బురదలో తిరిగి ఉంటే చేసిన పాపాలు కొంతయినా పోయేవన్నారు చంద్రబాబు. అలా చేయకుండా బెంగళూరులో కూర్చొని తమపై బురద జల్లడమేంటని ప్రశ్నించారు. అంతే కాదు ప్రకాశం బ్యారేజ్‌ని కూల్చేందుకు బోట్లు వదిలి కుట్ర చేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ వాళ్లకు సిగ్గుండాలంటూ కౌంటర్ ఇచ్చారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం వాళ్లకే సాధ్యమైందన్నారు.మరోవైపు ప్రకాశం బ్యారేజీలోకి కొట్టుకొచ్చిన బోట్లతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జగన్ అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటితో విజయోత్సవ ర్యాలీలు చేశారన్నారు. నిందితులు ఉషాద్రి, రామ్మోహన్‌తో టీడీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. వరద వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి బోటు రాజకీయాలు, అక్రమ అరెస్టులను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.కూటమి పాలనలో మార్పు రాకపోతే, భవిష్యత్ లో టీడీపీ వాళ్లకు జైలే గతి అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించాక ఘాటు కామెంట్స్ చేశారు. ఎల్లకాలం కూటమి పాలన ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలని తమ ప్రభుత్వం వస్తే, టీడీపీ నాయకులు ఇదే గుంటూరు జైల్లో గడపాల్సి వస్తుందని జగన్ వార్నింగ్ ఇచ్చారు. భారీ వరద, వర్షాలున్నాయని వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చినా చంద్రబాబు రివ్యూలు చేయలేదన్నారు. మరోవైపు బుడమేరు గండ్లు కూడా పూడ్చలేకపోయారని, పనులు చేయకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని చంద్రబాబు ఫైర్ అవుతున్నారు. ఆక్రమణలకు వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు.