3కార్లు, గొడ్డళ్లు, రంపాలు స్వాధీనం
తిరుపతి:నాగపట్ల అటవీ ప్రాంతంలోకి చొరబడుతున్న 19మందిని టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి మూడు కార్లు, 4పిడిలేని ఇనుప గొడ్డళ్లు, ఒక ఇనుప బారీస, 4ఇనుప రంపాలు స్వాధీనం చేసుకున్నారు.టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.శ్రీనివాస్ అధ్వర్యంలో ఆర్‌ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన కేఎస్కే లింగాధర్ టీమ్ ఆదివారం కూంబింగ్ చేపట్టింది.ఈ బృందం బాకరాపేట చేరి, అక్కడ నుంచి శ్రీవారిమెట్టు వైపు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేసుకుంటూ వస్తుండగా, చంద్రగిరి మండలం నాగపట్ల అటవీ పరిధిలోని నరసింగాపురం రైల్వే గేటు సవిూపంలోని రైల్వేఅండర్ బ్రిడ్జి సవిూపంలోని నిషేధిత అటవీ ప్రాంతంలో మూడు వాహనాలు కనిపించాయి. వాహనాలను చుట్టుముట్టి తనిఖీ చేస్తుండగా, అందులోని వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కారులో నాలుగు పిడిలేని గొడ్డళ్లు, ఒక ఇనపు బారిస, నాలుగు ఇనుప రంపాలు ఉన్నాయి. వారిని విచారించగా ఎర్రచందనం కోసం అడవిలోకి వెళుతున్నట్లు తెలిసింది. అరెస్టయిన వారిలో తిరుపతి సత్యనారాయణపురంకు చెందిన ఎన్బీ శివ (45), డీ. జానకిరామ్ (36),రైల్వే కోడూరుకు చెందిన నాయని శివ (36), తోట లక్ష్మీపతి (30), కార్వేటి నగరానికి చెందిన ప్రభాకర్ (45), తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన దక్షిణా మూర్తి (29), సినరాజా (49), కుమార్ చిన్నపయ్యన్ (35), తిరుపత్తూరు జిల్లాకు చెందిన రామలింగరాజు (54), పార్తిబన్ కుమార్ (24), స్వామినాథన్ అన్నామలై (38), వాసుమణి (23),ఆర్ రవి (40), ఏ. అన్నామలై (35), కార్తీక్ (42), సేతుమణి (26), శంకర్ (44), కుమార్ రాజా (44), కార్తీక్ (25)లు ఉన్నారు. వీరిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయగా, సీఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.