కొత్త నేర చట్టాలతో ప్రజల హక్కులకు విఘాతం!
*******
*పోలీసులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టిన కొత్త నేర చట్టాలు!
*జీవించే హక్కును కాలరాచేవిగా కొత్త నేర చట్టాలు
*న్యాయవ్యవస్థ పరిమితులను అధిగమించేవిగా ఉన్న నేర చట్టాలు
*నిపుణులతో చర్చించకుండానే చట్టాల రూపకల్పన చేశారు
*ఎఫ్.ఐ.ఆర్ కంటే ముందు పోలీసులు విచారణ చేపట్టవచ్చు అనడం పోలీసులకు అపరిమిత అధికారాలు ఇవ్వడమే!!!
*కొత్త నేర చట్టాల అమలును ఆపాలని భారత న్యాయవాదుల సంఘం డిమాండ్(IAL) !!

రాయచోటి,1 జూలై 2024: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేరచట్టాలు ప్రజల హక్కులను హరించే విధంగా ఉన్నాయని వాటి అమలు తక్షణం ఆపివేయాలని భారత న్యాయవాదుల సంఘం కడప ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఈశ్వర్ , రాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. రెడ్డయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేరచట్టాల ను జూలై 1 నుండి అమలు చేస్తున్న సందర్భంగా వారు అంబేద్కర్ ఫ్లెక్సీ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు ఏవైనప్పటికీ అప్పటివరకు ఉన్న చట్టాల కంటే మెరుగ్గా ఉండాలి కానీ కొత్త నేర చట్టాలు ప్రజల జీవించే హక్కును కాలరాచే విధంగా ఉన్నాయని ఈ చట్టాలను అమలు తక్షణం ఆపేయాలని వారు డిమాండ్ చేశారు. 95 శాతం వరకు పాత సెక్షన్లను నంబర్లు మార్చడం ఐపిసి , సి ఆర్ పి సి, ఎవిడెన్స్ యాక్ట్ లకు దేశ ప్రజలందరికీ సంబంధం లేని భాషలో పేర్లు పెట్టి గందరగోళపరిచే విధంగా ఉన్నాయని వీటిని అర్థం చేసుకోవడానికి మరో 20 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అన్నారు. నిపుణులతో కానీ పార్లమెంటులో గాని సరైన పద్ధతిలో చర్చించకుండానే చట్టాలను తయారు చేశారని వారన్నారు. ఇండ్ల స్థలాల కోసం మిగులు భూముల పంపకాల కోసం పోరాటం చేసేవారు , ప్రజల సమస్యలపై పోరాటమే నేరంగా పరిగణించబడుతుందని పోరాడే ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి యువజన తదితర సంఘాలు అందులో పనిచేసే కార్యకర్తలు నాయకులు నేరస్థులవుతారని వారికి బేడీలు వేసి న్యాయస్థానం ఎదుట హాజరు పరుస్తారని ఈ చట్టం చెబుతోందని వారన్నారు. ప్రజల హక్కులను హరించే ఉండే ప్రభుత్వ విధానాలను విమర్శించే కవులు, కళాకారులు ,మేధావులు నేరస్తులు అవుతారని వీరి చర్యలు టెర్రరిస్టు చర్యలుగా ఈ చట్టంలో వర్ణించబడ్డాయని వీరు ప్రజల కోసం చేసే పనులన్నీ కూడా నేరాలుగా పరిగణించి ఐదు సంవత్సరముల నుండి జీవితకాలం వరకు శిక్షలు విధించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని తెలిపారు. పోలీసు అధికారి ఇచ్చే ఆదేశాలను వినకపోతే 24 గంటలు నిర్బంధించవచ్చునని ,అనుమానం మీద పోలీసులు 24 గంటల పాటు పౌరులను నిర్బంధించవచ్చునని ఈ చట్టం చెబుతోందని ఇది ప్రస్తుతం ఉన్న చట్టాలకు విరుద్ధమని ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమని వారు అన్నారు. 33 రకాల నేరాలకు కొత్తగా తీసుకొచ్చిన నేర చట్టంలో జైలు శిక్ష లను పెంచారని తెలిపారు. నేరాన్ని బట్టి శిక్షను ఖరారు చేసే న్యాయవ్యవస్థ యొక్క విచక్షణ అధికారాన్ని కొత్త నేర చట్టం తొలగించిందని దీన్నిబట్టి న్యాయవ్యవస్థ పై అధిపత్యాన్ని చలాయించడం కోసమేనని ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వారన్నారు. బ్రిటిష్ కాలంలో దేశద్రోహం కింద నమోదు చేసే సెక్షన్ 120 A రాజ్యాంగ విరుద్ధమని ఈ సెక్షన్ పై సుప్రీంకోర్టు స్టే విధించినప్పటికీ నూతన నేర చట్టంలో సెక్షన్ 150 గా ముందుకు తీసుకొచ్చి దీనికి మరింత పదును పెట్టి ప్రజల హక్కుల హరించే విధంగా చేశారని తీవ్రంగా విమర్శించారు. సత్వర న్యాయం కోసం కొత్త నేర చట్టాలను రూపొందించామని కేంద్రం చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటివరకు ఐదు కోట్ల వరకు కేసులు పెండింగ్లో ఉన్నాయని ఈ కేసులు పరిష్కారం చేయాలంటే న్యాయమూర్తుల సంఖ్యను ఇప్పటికంటే పది రెట్లు పెంచి మండల స్థాయి వరకు న్యాయస్థానాలు విస్తరించాలని అప్పుడే సత్వర న్యాయం జరుగుతుందని అలా చేయకుండా చట్టాలను కఠిన తరం చేయడం పలానా తేదీలోపు కేసులు పరిష్కారం కావాలని నిబంధన పెట్టినంత మాత్రాన న్యాయమూర్తులకు అనవసర పని ఒత్తిడి పెరగడం తప్ప ప్రయోజనం ఉండదని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి చట్టాలతో మనం నాగరిక సమాజాన్ని కోరుకుంటున్నామా? ఆటవిక సమాజాన్ని కోరుకుంటున్నామా? అనే అనుమానం కలుగుతోందని అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నేర చట్టంలో ఇంకా చాలానే హక్కులను హరించే విధంగా ఉన్నాయని వీటిని అమలు చేయడం తక్షణం ఆపకపోతే రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్త ఆందోళన ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయచోటి బార్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి డి నాగముని, సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ రాజు ఆనంద్ కుమార్ ధనుంజయ్ కుమార్ కృష్ణయ్య హోమయోన్ బాషా, ప్రజా సంఘాల నాయకులు రామాంజనేయులు అక్బర్ అలీ పామయ్య న్యాయవాదులకు మద్దతుగా పాల్గొన్నారు

అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంబేద్కర్ ఫ్లెక్సీ వద్ద నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *