కడప, జూన్‌ 7 : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా స్పష్టమైన మెజారిటీని సాధించింది. శ్రీకాకుళం నుంచి కడప వరకు అన్ని ప్రాంతాల్లో సత్తా చాటింది. కొన్ని జిల్లాల్లో అయితే వైట్‌ వాష్‌ చేసింది. చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా అధికార వైసిపి 11 స్థానాలతో సరిపెట్టుకుంది. సీఎం జగన్‌ క్యాబినెట్లో ఒక్క పెద్దిరెడ్డి మినహాయించి.. మంత్రులంతా పరాజయం పాలయ్యారు. అయితే వైసీపీకి ఇది ఊహించని పరిణామం. గత ఎన్నికల్లో అంతులేని మెజారిటీతో గెలిచిన ఆ పార్టీ.. ఇప్పుడు అదే స్థాయిలో ఓటమిని ఎదుర్కొంది. పొలిటికల్‌ డిజాస్టర్‌ గా మారింది. ఒకానొక దశలో సింగిల్‌ డిజిట్‌ కు పరిమితం అవుతుందని అంతా భావించారు. కానీ అతి కష్టం విూద 11 సీట్లను సాధించగలిగింది.పులివెందుల నుంచి జగన్మోహన్‌ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు 28 వేల వరకు మెజారిటీ తగ్గడం విశేషం. 61, 687 ఓట్లతో జగన్మోహన్‌ రెడ్డి గెలుపొందారు. అరకు వ్యాలీ నుంచి రాగం మత్స్యలింగం 31, 877 ఓట్లతో విజయం సాధించారు. పాడేరులో మత్సరస విశ్వేశ్వర రాజు 19,338 ఓట్లు, బద్వేలులో దాసరి సుధా 18,567 ఓట్లు, మంత్రాలయంలో వై బాలనాగిరెడ్డి 12,805 ఓట్లు, తంబాళ్లపల్లెలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి 10,103 ఓట్లు, రాజంపేటలో అమర్నాథ్‌ రెడ్డి 7,016 ఓట్లు, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6,095 ఓట్లు, ఎర్రగొండపాలెం లో తాటిపర్తి చంద్రశేఖర్‌ 5200 ఓట్లతో, ఆలూరులో విరూపాక్షి 2831 ఓట్లతో, దర్శి లో బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి 2456 ఓట్లతో విజయం సాధించారు.అయితే కూటమి అభ్యర్థులు గెలిచిన చోట్ల భారీ మెజారిటీలు నమోదయ్యాయి. గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించారు. 94 వేల ఓట్లు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రధముడిగా నిలిచారు. గత ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. అటువంటిది ఈసారి ఆయన మెజారిటీ తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కూటమి ప్రభంజనంలో 11 మంది వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అందులో సగం మంది పదివేల మెజారిటీ లోపే ఉండడం విశేషం. ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. గెలిచిన చోట సైతం వైసీపీ మెజారిటీల విషయంలో పెద్దగా ప్రభావం చూపలేదు. మరి ఈ పరిస్థితుల నుంచి వైసిపి ఎలా ముందుకెళ్తుందో చూడాలి.గత ఎన్నికల్లో వైసీపీ సైతం ఇదే స్థాయిలో మెజారిటీలను నమోదు చేసింది. అప్పట్లో కూడా టిడిపి కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్‌ అయింది. టిడిపి కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలు సాధించగా.. గెలిచిన చోట సైతం వైసీపీ అభ్యర్థులు తక్కువ మెజారిటీనే నమోదు చేశారు.అయితే కొన్ని నియోజకవర్గాల్లో వార్‌ వన్‌ సైడే అన్నట్టు పరిస్థితి మారింది. ఎక్కడ కూడా 20 వేల ఓట్ల మెజారిటీలు టిడిపి అభ్యర్థులకు తగ్గలేదు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *