సేమ్‌ 2 సేమ్‌…
ఏపీలో మారని రాజకీయాలు
విజయవాడ, అక్టోబరు 4: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసులలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కూడా సీఐడీ నోటీసులు ఇచ్చింది. లోకేశ్‌ని కూడా జైలుకు పంపించి… నాయకత్వ లేవిూతో టీడీపీ శ్రేణులను నిరాశకు గురిచేయాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. నాయకుడు జైల్లో ఉంటే ఏమవుతుంది? గతంలో జగన్‌ జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో… ఇప్పుడూ అదే జరుగుతుంది. అప్పుడు దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి సతీమణి విజయమ్మ పాత్రను ఇప్పుడు చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి, కూతురు షర్మిల పాత్రను ఆయన కోడలు బ్రాహ్మణి పోషిస్తున్నారు. ఈ రాజకీయాలలో మారేది పాత్రలే తప్ప కథ, స్క్రీన్‌ప్లే కాదు. చట్ట సభల్లో 33 శాతం మహిళల రిజర్వేషన్‌ అమలుకు ఇంకా సమయం పట్టవచ్చేమోగానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దశాబ్దకాలంగా మహిళలే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
దివంగత నేత వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం సీనియర్‌ నేత రోశయ్యను, అనంతరం కిరణ్‌కుమార్‌ రెడ్డిని సీఎంగా చేయడంతో జగన్మోహన్‌రెడ్డి పార్టీ హైకమాండ్‌కు ఎదురుతిరిగారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కుర్చీ దక్కదనే అంచనాతో 2010 నవంబర్‌ 29న ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీని బలోపేతం చేయడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్న క్రమంలో అక్రమంగా ఆస్తులు కూడగట్టారనే అభియోగంతో 2012 మే 27న జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జగన్‌ చంచల్‌గూడ జైలులో ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జైల్లో ఉన్నారు కాబట్టి పార్టీ చచ్చిపోతుందని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం భావించింది. కానీ అందుకు భిన్నంగా ఈ చర్యలే వైఎస్‌ఆర్‌సీపీ పునాదులు బలపడడానికి కారణాలయ్యాయి. జగన్మోహన్‌రెడ్డి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల రాజకీయ రంగప్రవేశానికి తలుపులు తెరుచుకున్నాయి.జగన్‌కి బెయిల్‌ దొరకకపోవడంతో షర్మిలా పార్టీ బాధ్యతలన్నింటినీ తన భుజాన వేసుకున్నారు. తనకు తాను ‘జగనన్న వదిలిన బాణం’ అని ప్రకటించుకున్న ఆమె 3 వేల కిలోవిూటర్ల భారీ పాదయాత్ర చేసి కష్టకాలంలో వైఎస్సార్సీపీని ఒడ్డున పడేశారు. 16 జిల్లాల్లో చేపట్టిన ఈ పాదయాత్రలో కోటిమందికి పైగా జనాలను షర్మిల ప్రత్యక్ష్యంగా కలిసినట్లు అంచనా. 2013 సెప్టెంబర్‌లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జగన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసే వరకూ షర్మిల పార్టీ కార్యక్రమాల్ని నిరాటంకంగా నడిపించారు. మరోవైపు విజయమ్మ అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల మనుసులను చూరగొనడనంతోపాటు పార్టీని బతికించారు, నిలబెట్టారు. విజయమ్మ సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా క్రియాశీల పాత్ర పోషించారు. వైఎస్సార్సీపీని తమ శక్తియుక్తులతో మండే అగ్నిగోళంలా తయారు చేసిన ఘనత ఈ తల్లీ కూతుళ్లకే దక్కుతుంది. ఆ తర్వాత జగన్‌ ప్రతిపక్ష నేత కావడం, ముఖ్యమంత్రి కావడంలో వీరిద్దరి పాత్ర వెలకట్టలేనిది.గతంలో జగన్‌ జైలు పాలయినప్పుడు తల్లీ కూతుళ్లు పార్టీ పటిష్టతకు కష్టపడితే, మరోవైపు జగన్‌ సతీమణి వైఎస్‌.భారతీ న్యాయ పోరాటంలో ఆయనకు బాసటగా నిలిచారు. జగన్‌ జైలు పాలయినప్పుడు కొణతాల రామకృష్ణ, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శోభనాగిరెడ్డి, మైసూరారెడ్డి, సోమయాజులు, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి సీనియర్‌ నేతలు పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేశారు.ఇప్పుడు చంద్రబాబు అరెస్టు కావడంతో టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న యనమల రామకృష్ణ, అశోక్‌ గజపతిరాజు, బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, రామ్మోహన్‌నాయుడు, బాలకృష్ణ వంటి సీనియర్‌ నేతలు పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు చేసి పార్టీలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారు. వీటికి అదనంగా నందమూరి కుటుంబం ఒక్కటై చంద్రబాబు పక్షాన నిలబడిరది. అంతేకాక, టీడీపీ`జనసేన కూటమి తరఫున ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఉమ్మడిగా కార్యక్రమాలు చేపడుతామని ఉభయ పార్టీల నేతలు చెప్పారు జగన్‌పై అక్రమంగా కేసులు నమోదు చేశారంటూ మద్దతు ప్రకటించిన వామపక్షాలు ఇప్పుడు కూడా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీకి బాసటగా ఉంటున్నారు. వీరికి పలు ప్రజాసంఘాలు కూడా తోడవుతున్నాయి. గతంలో జగన్‌పై కేసుల సందర్భంగా సీబీఐ సంస్థను కేంద్ర ప్రభుత్వం చేతిలో పంజరం అనే ఆరోపణలొస్తే, ఇప్పుడు చంద్రబాబు అరెస్టు తర్వాత సీఐడీని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పంజరం అంటూ అవే రకమైన విమర్శలు వెలువడుతున్నాయంటే అప్పటి నాటకం మళ్లీ ఇప్పుడు తిరిగి ప్రారంభమైందని చెప్పవచ్చు. గతంలో జగన్‌పై కేసులు నమోదు చేశాక అప్పడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నామరూపాల్లేకుండా పోయింది. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జగన్‌పై తుపాకీ పెట్టి చంద్రబాబును దెబ్బతీయాలని చూస్తోంది. ఇప్పటికే ఏపీలో నోటాతో పోటీ పడుతున్నా బీజేపీకి భవిష్యత్తులో భంగపాటు తప్పదని ప్రజాస్వామ్యవాదులు వ్యాఖ్యానిస్తున్నారు.2014కి ముందు వైఎస్‌.విజయమ్మ, షర్మిలా ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ఆ పాత్రలనే పోషిస్తున్నారు. కూలిపోతుందనుకున్న వైఎస్‌ఆర్‌సీపీని విజయమ్మ, షర్మిలా ఏ విధంగా తమ భుజాలకెత్తుకున్నారో, ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్న టీడీపీని నిలబెట్టడానికి భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా రంగంలోకి దిగారు. అంతేకాక ఈ నలుగురి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ సతీమణిగా విజయమ్మకు ఆనాడు ఏ పలుకుబడి ఉందో, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కూతురిగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్యగా భువనేశ్వరికీ అంతే ఆకర్షణ శక్తి ఉంది. ఒక ముఖ్యమంత్రి బిడ్డగా షర్మిలాకు ఎలాంటి ఆదరణ లభించిందో, ఒక ముఖ్యమంత్రి మనవరాలిగా, మరో ముఖ్యమంత్రి కోడలిగా, సినీ నటుడి కుమార్తెగా బ్రాహ్మణికి కూడా అదే స్థాయి ఆకర్షణ ఉంది. వీరికి ఉన్న మరో సారుప్యత ఏమిటంటే వీరెవరికీ అంతకుముందు రాజకీయ అనుభవం లేకపోవడం, తమ అధినేతలు జైలుకు వెళ్లడంతో అనివార్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించడం!యువ వ్యాపారవేత్తగా విజయవంతంగా రాణిస్తున్న నారా బ్రాహ్మణి త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్‌ పూర్తి చేసిన నారా బ్రాహ్మణి, హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ ఆ సంస్థను ఉన్నత స్థానానికి తీసుకెళ్లడంలో కృషి చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత కష్టాల్లో ఉన్న పార్టీ బాధ్యతను కూడా ఆమె తన భుజాన వేసుకునేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌ అయిన దగ్గర నుంచి భర్త లోకేష్‌కు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ‘నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు’ వంటి బాణాల్లాంటి మాటల్ని సంధిస్తూనే, చంద్రబాబుకి మద్దతుగా ‘కాగడాలు వెలిగిద్దాం, మోతమోగిద్దాం’ లాంటి వినూత్న నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆక్టోబర్‌ 2వ తేదీన ‘సత్యమేవ జయతే’ పేరుతో నిరాహార దీక్షలను భువనేశ్వరి, బ్రాహ్మణి ఆధ్వర్యంలో తెలుగుదేశం పెద్దఎత్తున చేపట్టింది. ఇలాంటి నిరసనలనే గతంలో విజయమ్మ కూడా చేపట్టారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *