రాజమండ్రి, మే 21 : ఏపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యేది ఎవరు? ఎవరెవరికి ఛాన్స్‌ ఉంటుంది? బిజెపి నుంచి ఎంతమంది అవుతారు? టిడిపి నుంచి ఎవరు? జనసేనకు అవకాశం ఉంటుందా? ఉంటే ఎవరికి ఇస్తారు? ఏపీ పొలిటికల్‌ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీ నుంచి 25 పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా బిజెపి ఆరుచోట్ల, జనసేన రెండు చోట్ల, టిడిపి 17 చోట్ల పోటీ చేస్తున్నాయి. కేంద్రంలో ఖచ్చితంగా ఎన్‌ డి ఏ హ్యాట్రిక్‌ కొడుతుంది. దీంతో ఏపీ నుంచి మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే ఎవరికి దక్కుతుందా? అన్న చర్చ నడుస్తోంది.ముందుగా బిజెపి నుంచి తీసుకుంటే రాజమండ్రి ఎంపీగా గెలుపొందితే పురందేశ్వరికి తప్పకుండాఛాన్స్‌ దక్కే అవకాశం ఉంది.ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండడం,కేంద్ర మంత్రిగా పనిచేసే అనుభవం ఉండడం, బలమైన సామాజిక వర్గానికి చెందిన మహిళనేత కావడం ఆమె పేరును పరిగణలో తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రాజంపేట లోక్సభ స్థానం నుంచి కిరణ్‌ కుమార్‌ రెడ్డి గెలుపొందితే ఆయనకు సైతం కేంద్ర క్యాబినెట్‌ లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మాజీ సీఎం కావడం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన పేరును పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు అనకాపల్లి ఎంపీగా గెలుపొందితే సీఎం రమేష్‌ సైతం రేసులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.తెలుగుదేశం పార్టీకి సంబంధించి బిసి వర్గానికి చెందిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేరు వినిపిస్తోంది. ఈయన శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానం నుంచి గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. గతఎన్నికల్లో జగన్‌ ప్రభంజనంలో సైతం నిలిచారు. అందుకే ఆయన పేరును పరిగణలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్‌, రెడ్డి సామాజిక వర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.జనసేనకు సంబంధించి మచిలీపట్నం ఎంపీగా గెలిస్తే వల్లభనేని బాలశౌరికి కేంద్ర క్యాబినెట్‌ లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపునాగబాబును రాజ్యసభకు పంపి.. కేంద్ర క్యాబినెట్‌ లోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అయితే ఏపీకి కేంద్ర క్యాబినెట్లో మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. కానీ జాబితాలో పదిమంది వరకు ఉండడం విశేషం. మరి ఎంతమందికి అవకాశాలు దక్కుతాయో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *