ఈసీ ఉత్తర్వుల తుంగలో తొక్కి..జగన్‌ ఆడుతున్న పైశాచిక క్రీడలో…
లబ్ధిదారులను వేధించి అధికార పార్టీకి లబ్ది చేకూర్చడం బాధాకరం
సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ
అమరావతి, మే 3
ఏపీలో పెన్షన్ల కోసం పెన్షన్‌దారులు అష్టకష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల వద్ద పెన్షన్‌దారులు పడిగాపులు కాస్తున్నారు. చాలా అకౌంట్లు ఇన్‌ఆపరేటివ్‌ అయి ఉండటంతో.. అకౌంట్లను ఆపరేషన్‌లోకి తెచ్చేందుకు ఆధార్‌ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్‌ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. చదవురాని అనేక మంది పెన్షనర్లు దరఖాస్తులు నింపేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అసలు తమకు పెన్షన్‌ అందుతుందా లేదా అనే ఆందోళనలో పెన్షన్‌దారులు ఉన్నారు. ఈ క్రమంలో పెన్షన్‌దారులు ఇబ్బందులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.
సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు సామాజిక పెన్షన్ల లబ్ధిదారులను వేధించి అధికార పార్టీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం బాధాకరమన్నారు. ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వ అధికారి ప్రజలకు మేలు చేసే అవకాశాలను కనీసం కూడా ఆలోచించడం లేదన్నారు. ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేలా నిర్ణయాలు తీసుకోవడం అభ్యంతరకరం, అత్యంత దుర్మార్గమని లేఖలో తెలిపారు.
ఈసీ ఉత్తర్వుల తుంగలో తొక్కి…
వృద్దులు, దివ్యాంగులు, వితంతవులు, ఇతర పెన్షన్‌ దారులు ఇబ్బందులు పడకుండా పెన్షన్‌ పంపిణీ సకాలంలో జరిగే అవకాశాలను పరిశీలించాలని ఎన్నికల కమిషన్‌ ఏప్రిల్‌ 2న ఇచ్చిన మెమోలో పేర్కొందని.. అయినా ఆ ఉత్తర్వుల్ని తుంగలో తొక్కుతూ, గత నెలలో సచివాలయాల వద్ద బారులు తీరేలా చేసి 33 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని తెలిపారు. లక్షలాది మందిని వేధించారన్నారు. ఈనెల కూడా అదే విధంగా పెన్షన్‌దారులను రోడ్లపై మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేసి, నరకయాతనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేంత వ్యవస్థ గ్రామస్థాయిలో ఉన్నప్పటికీ, ఇళ్ల వద్ద ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారన్నారు. పెన్షన్‌ పంపిణీ పూర్తి చేసే అవకాశం ఉన్నా అలా చేయకుండా రాజకీయ కుట్రలకు ప్రాధాన్యమివ్వడం దుర్మార్గమన్నారు. రాజకీయంగా అధికార పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలో భాగమై.. పెన్షన్‌ నగదును బ్యాంకుల్లో జమ చేయడం వలన పెన్షన్‌ సొమ్ము తీసుకోవడానికి వృద్ధులు ముప్పుతిప్పలు పడుతున్నారని ఆవేదన చెందారు. బ్యాంకులకు వెళ్లిన వారికి కేవైసీ పేరుతో బ్యాంకు సిబ్బంది ఆధార్‌, పాన్‌ తీసుకురమ్మని చెబుతున్నారని.. వాటి కోసం మండుటెండలో లబ్దిదారులు రోడ్లపై తిరగాల్సి వస్తోందన్నారు. మరోవైపు జాయింట్‌ ఖాతాలు, వ్యక్తిగత ఖాతాలు రెండూ ఉన్నవారికి ఏ ఖాతాలో నగదు జమయ్యిందో తెలియక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
జగన్‌ ఆడుతున్న పైశాచిక క్రీడలో..
గత నెల మండుటెండలో సచివాలయాల చుట్టూ తిప్పారని.. ఇప్పుడు భారీగా మండిపోతున్న ఎండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారని చెప్పారు. లబ్దిదారులు బ్యాంకులకు ఎలా చేరుకుంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఆడుతున్న రాజకీయ పైశాచిక క్రీడలో ప్రభుత్వ అధికారిగా ఉన్న సీఎస్‌ భాగస్వామిగా మారడం పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. ఎక్కడో మండల కేంద్రాల్లో ఉన్న బ్యాంకుల చుట్టూ తిప్పుతూ దాదాపు దాదాపు 65 లక్షల మందిని అవస్థలకు గురి చేస్తున్నారన్నారు. గత నెలలో 35 మంది చనిపోతే, ఇప్పుడు ఒక్క రోజే దాదాపు 6గురు ప్రాణాలు కోల్పోయారన్నారు. ‘‘ఈ మారణ హోమానికి ఏ1 జగన్‌ రెడ్డి, ఏ2 విూరే’’ అంటూ సీఎస్‌పై మండిపడ్డారు.ప్రస్తుతం రాష్ట్రంలో 43 నుండి 47 డీగ్రీల మధ్య ఉష్ణోగతలు నమోదవుతున్నాయి.. ఇలాంటి సమయంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్ని, దివ్యాంగుల్ని ఇతర పెన్షన్‌ దారుల్ని బ్యాంకుల చుట్టూ తిప్పడం ఎంత మాత్రమూ సబబు కాదన్నారు. పేదల ప్రాణాలతో రాజకీయం చేయాలనుకోవడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. తక్షణమే ప్రతి లబ్దిదారుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికీ పెన్షన్లు అందించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేస్తోందంటూ చంద్రబాబు లేఖ రాశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *