23 నుంచి ఫీజు చెల్లింపు
24 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ
రాయచోటి:-ఏపీ డీ ఈ ఈ సెట్ 2024 కు సంబంధించి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, రెండేళ్ల ఉపాధ్యాయ కోర్సులో చేరడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈనెల 23వ తేదీన ఆన్లైన్లో ఫీజు చెల్లించి, 24 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఉమ్మడి కడప జిల్లా ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి గారు మంగళవారం తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. రెండేళ్ల కోర్సులో చేరేందుకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. ఉమ్మడి ప్రవేశపరీక్ష (కంప్యూటర్ బేస్డ్ )ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని వివరించారు. 2024 సెప్టెంబర్ ఒకటవ తేదీ నాటికి అభ్యర్థులకు 17 ఏళ్లు నిండి ఉండాలన్నారు. దీనికి గరిష్ట వయోపరిమితి ఉండదని తెలిపారు. దరఖాస్తు రుసుము 750 రూపాయలు చెల్లించాలన్నారు. మే నెల ఎనిమిదో తేదీన ఫీజు చెల్లింపుకు, 9న దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగుస్తుందన్నారు. మే నెల 21వ తేదీన ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు తమ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. 24వ తేదీన పరీక్ష, మే 30 తేదీన ఫలితాలు వెల్లడి అవుతాయన్నారు. జూన్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అభ్యర్థులు కళాశాలలు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అన్నారు. 10వ తేదీన అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ప్రభుత్వం డిఎడ్ కళాశాలలను కేటాయిస్తుందని , జూన్ 12 నుంచి 15 వరకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుందన్నారు.జూన్ 20వ తేదీన కళాశాలల్లో తరగతులకు హాజరు కావలసి ఉంటుందని పేర్కొన్నారు.