గుంటూరు, మార్చి 27: జనసేన పార్టీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. తమకు బలమున్న చోట, బలమైన నేతలున్న చోట కాకుండా ఇతర స్థానాలను తీసుకోవడం పట్ల వారు గుర్రుగా ఉన్నారు. తొలుత 24 స్థానాలంటే ఒకింత అసహనానికి గురైన క్యాడర్‌, లీడర్లు.. ఆ తర్వాత 21కి తగ్గించుకున్న తర్వాత ఒకింత ఆందోళనకు గురయ్యారు. పట్టున్న ప్రాంతంలో కాకుండా జనసేనను బలహీనంగా ఉన్న చోట పోటీ చేయించి మరింత వీక్‌ చేసేందుకు చేసిన ప్రయత్నాల్లో మిత్రపక్షం సక్సెస్‌ అయిందన్నది నేతల వాదనగా వినిపిస్తుంది. బలమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలను తీసుకోకపోవడంతో పాటు అసలు నేతలే లేని చోట తాము తగుదునమ్మా అంటూ బరిలోకి దిగడం ఎంతవరకూ సబబని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ ను సీట్ల విషయంలోనూ, స్థానాల ఎంపికలోనూ, అభ్యర్థుల ఖారారులోనూ తప్పుదోవ పట్టించింది నాదెండ్ల మనోహర్‌ అని పలువురు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రైల్వే కోడూరు వంటి స్థానాల్లో పోటీ చేయడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. అక్కడ నేతలు కానీ, క్యాడర్‌ కాని ఎవరైనా ఉన్నారా? అని నిలదీస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూర్చడం కోసమే నాదెండ్ల మనోహర్‌ ఆ పార్టీ కోవర్టుగా వ్యవహరించి పవన్‌ ను పక్కదారి పట్టించేలా చేస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. నాదెండ్ల తొలి నుంచి పార్టీలో పవన్‌ ను కలవనివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా తప్పుడు సలహాలు ఇస్తున్నారని, ఆ ప్రమాదాన్ని తాము ముందే ఊహించామని అంటున్నారు. పార్టీని పణంగా పెట్టి… నాదెండ్ల మనోహర్‌ కారణంగానే అనేక మంది నేతలు పార్టీని వీడిపోయిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. నాదెండ్ల తొలి నుంచి పవన్‌ పక్కనే తిరుగుతూ తప్పుడు సమాచారం అందిస్తూ పార్టీ కోసం, పవన్‌ కోసం పనిచేస్తున్న నేతలను పక్కన పెడుతూ వస్తున్నారన్నారు. కేవలం తాను గెలవడం కోసం నాదెండ్ల పార్టీని పణంగా పెట్టారంటున్నారు. ఆయన అనుమతి లేనిదే పవన్‌ ను కలిసేందుకు కూడా వీలులేదని, సీట్ల సర్దుబాటు విషయంలోనూ నాదెండ్ల చంద్రబాబు పక్షాన చేరి పవన్‌ ను తన మాటలతో మార్చివేశారంటున్నారు. నాదెండ్లతో పాటు లింగమనేని కూడా పరోక్షంగా పవన్‌ కు సలహాలిస్తున్నందునే ఆయన ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని వాపోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్క స్థానాన్ని తీసుకోవడమేంటని వారు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. పారా చూట్‌ నేతలకు… నాదెండ్ల మనోహర్‌ ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టిక్కెట్లు ఇప్పించడంలో పవన్‌ ఒప్పించడంలో సక్సెస్‌ అయ్యారంటున్నారు. పారాచూట్‌ నేతలకు టిక్కెట్లు ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి సీటును అప్పుడే పార్టీలో చేరిన ఆరణి శ్రీనివాసులుకు ఎలా ఇస్తారంటూ అక్కడి జనసేన నేతలు గుర్రుమంటున్నారు. టిక్కెట్లు పొందిన వారిలో ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలేనని, పార్టీలో కష్టపడిన వారికి నాదెండ్ల ప్రాధాన్యత లేకుండా చేశారంటున్నారు. అధికారంలోకి వస్తే తాను మంత్రిపదవిని పొందాలన్న ఏకైక లక్ష్యంతో నాదెండ్ల మనోహర్‌ పవన్‌ కు తప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ జనసైనికుల్లో రాంగ్‌ సిగ్నల్స్‌ పంపారని, ఇలాగయితే పవన్‌ పార్టీని కూడా విలీనం చేసేంతవరకూ నాదెండ్ల నిద్రపోరని కూడా సోషల్‌ విూడియాలో కామెంట్స్‌ పోస్టు చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *