ముద్రరాక్షసాలతో ఏపీపీఎస్సీ
విజయవాడ, మార్చి 18: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌`1 పోస్టుల భర్తీకి మార్చి 17న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షలో ప్రశ్నల తీరుతో అభ్యర్థులు బెంబేలెత్తిపోయారు. ప్రధానంగా అనువాద, అక్షర, అన్వయ దోషాలు స్పష్టంగా కనిపించారు. ఇవి అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోనికి అనువదించడంలో ఎక్కువ తప్పులు దొర్లాయి. గూగుల్‌ ట్రాన్స్‌లేటర్‌ వాడారా? అన్నట్లు ప్రశ్నల అనువాదం జరిగింది. తెలుగు అభ్యర్థులు ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి అటు ఆంగ్లంలో, ఇటు తెలుగులోని ప్రశ్నలను పలుమార్లు చదివేందుకు సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. కొన్ని సార్లు అనువాదం సరిగ్గా అర్థంకాక అయోమయానికి గురయ్యారు. మరోపక్క గ్రూప్‌`2 ప్రిలిమ్స్‌లో మాదిరిగానే గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌లోనూ ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉంది. వీటిని అర్థం చేసుకోవడానికి అభ్యర్థులకు ఎక్కువ సమయం పట్టింది. కొన్ని ప్రశ్నలు సివిల్స్‌ కంటే సంక్లిష్టంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు తెలిపారు. ముఖ్యంగా 63 పేజీలతో ఉన్న పేపర్‌`1 ప్రశ్నపత్రం అభ్యర్థులకు అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. కమిషన్‌ నిర్వహించే పరీక్షల్లో ఆంగ్లం నుంచి తెలుగులోకి ప్రశ్నలను అనువాదం చేయడంలో తరచూ తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. దీనివల్ల తెలుగు మాధ్యమంలో చదివిన వారు పోటీలో వెనుకబడుతున్నారు.
ప్రశ్నల తీరు ఓసారి పరిశీలిస్తే..
? హిస్టరీ విభాగం 22వ ప్రశ్నలో ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోనికి అతివాద దశ అని పేర్కొనడానికి బదులు తీవ్రవాద దశగా అనువాదం చేశారు.
? పేపరు`2లో..
` సైన్స్‌ అండ్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం ( 66వ ప్రశ్నలో శరీరంలోని నాడీ వ్యవస్థకు సంబంధించి కొత్త(నావెల్‌) పరికరం ద్వారా నిర్థారణ పరీక్షలు అన్న ప్రశ్న తెలుగు అనువాదంలో నవల అని ముద్రించారు. దీని వల్ల అర్థం పూర్తిగా మారిపోయినట్లయింది.
` 71వ ప్రశ్నలో ‘విపత్తు’ అనే పదాన్ని ఇవ్వకుండా ఇంగ్లిష్‌ పదాన్ని అలాగే ఇచ్చారు.
` 109వ ప్రశ్నలో ‘కోస్ట్‌ గార్డ్‌ సైనిక విన్యాసాలు’ అని కాకుండా ‘కోస్ట్‌ గార్డ్‌ వ్యాయామం’ అని ముద్రించారు.
` 89వ ప్రశ్నలో ‘జీవ విచ్ఛన్నం’ అనే పదానికి బదులుగా ‘స్మార్ట్‌ బయోడిగ్రేడబుల్‌’ అని ఇంగ్లిష్‌లోనే యథాతథంగా ఇచ్చారు.
` 90వ ప్రశ్నలో ‘గుండ్రటి రూపం’ అనడానికి బదులు ఇంగ్లిష్‌లోని ‘రింగ్‌’ అనే పదాన్ని తెలుగులోనూ అదే విధంగా ఇచ్చారు.
` మరో ప్రశ్నలో తెలుగులో ‘భ్రూణం’ అని ముద్రించాల్సి ఉండగా ‘పిండం’ అని ముద్రించారు.
? ఇక జైన మతరచనల గురించి అడిగిన ప్రశ్నలో ప్రాకృతంకు బదులుగా కృతాన్ని, జైనులు అనే పదానికి ప్రాజైనులు అని ముద్రణ అయింది. మరోప్రశ్నలో పార్లమెంటరీ విశేషాధికారాలు అని కాకుండా పార్లమెంటరీ అధికారాలు అని అనువదించారు. ఇదే ప్రశ్నలో వైడర్‌ ఇంప్లికేషన్స్‌ అనే పదాన్ని విస్తృత పరిణామాలు అని అనువదించడానికి బదులు విస్తృతమైన చిక్కులుగా ముద్రించారు.
? వర్తమాన అంశాల్లో ఏపీ గురించి 2023 సెప్టెంబరులో ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల గురించిన ప్రశ్న వచ్చింది. హిస్టరీ అండ్‌ కల్చర్‌ విభాగంలో ఇచ్చిన ప్రశ్నలు గ్రూప్‌`2 ప్రిలిమ్స్‌ కంటే కఠినంగా ఉన్నాయి. ఈ విభాగంలో ఇచ్చిన 30 ప్రశ్నల్లో రెండిరటిని మాత్రమే నేరుగా అడిగారు.
? భారత ఆర్థికవ్యవస్థకు సంబంధించిన పలు ప్రశ్నలు ఒక పేజీని ఆక్రమించాయి. జాగ్రఫీలో వచ్చిన ప్రశ్నలు ఒకటి, రెండుసార్లు చదివి విశ్లేషించుకుని, అవగాహనతో జవాబులు గుర్తించే విధంగా ఉన్నాయి.
? సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పార్టులో పర్యావరణంపై అంతర్జాతీయ ఒప్పందాలు, న్యూక్లియర్‌, జీవవైవిధ్యం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, స్పేస్‌, ఇతర రంగాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఎకానవిూలో మౌలిక సదుపాయాల కల్పన ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. ఏపీ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు తక్కువగా ఇచ్చారు.
ఇలా చాలా ప్రశ్నలు తెలుగులో అర్థరహితంగా ఇచ్చారు. ప్రశ్న పత్రంలో ముద్రణా పరంగానూ కొన్ని తప్పులు దొర్లాయి.కాగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌`1 పోస్టుల భర్తీకి మార్చి 17న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల పరిధిలో 301 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్‌`1 పరీక్ష నిర్వహించారు. గ్రూప్‌`1 పరీక్ష కోసం మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో మొత్తం 1,26,068 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నవారిలో పేపర్‌`1 పరీక్షకు 91,463 (72.55 శాతం) మంది , పేపర్‌`2 పరీక్షకు 90,777 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండు పేపర్లు రాసినవారిని మాత్రమే మెయిన్స్‌ పరీక్షకు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్‌ పరీక్షకు 1: 50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *