విజయవాడ, సెప్టెంబర్ 30: కుప్పంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనుకోవడం ఎంత అవివేకమో… పులివెందులలో టీడీపీ గెలుస్తుందనుకోవడం కూడా అంతే అవివేకం!! వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళతామని రాజమహేంద్రవరంలో ప్రకటించడంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిత్యం జపించే ‘వై నాట్ 175’ నినాదం మేకపోతు గాంభీర్యమని ఆ విమర్శలు చెప్పకనే చెబుతున్నాయి.జనసేన`టీడీపీ పొత్తు కుదిరితే వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా రాదని పందేలకు పేరు గాంచిన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పందేలు కాస్తున్నారు. ఉత్తరాంధ్రాతో పాటు ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వరకూ ఈ పొత్తు ప్రభావం బలంగా ఉండే అవకాశాలున్నాయి. ఇందువలనే పొత్తు కుదరకూడదని కోరుకున్న వైఎస్ఆర్సీపీ పొత్తు కుదిరాకా జనసేన`టీడీపీ కూటమిని చూసి బెంబేలెత్తుతోంది.దేశంలోని ప్రముఖ సంస్థలు ఏపీలో నిర్వహించిన సర్వేలను పరిశీలిస్తే గతంలో కంటే టీడీపీ`జనసేన ఓట్ల శాతం పెరిగిందనే అంశాన్ని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతిచ్చిన వివిధ సామాజికవర్గాలు, సమూహాలు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఆ పార్టీకి దూరమయ్యాయన్న విషయాన్ని కూడా ఆ సర్వే సంస్థల ఫలితాలను బట్టి తేటతెల్లమవుతుంది. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని ఆ పార్టీ డాంభీకమైన ప్రకటనలు చేస్తున్నా, జనసేన`టీడీపీ పొత్తుపై వారు చేస్తున్న విమర్శలను చూస్తే ఈ పొత్తుపై వైఎస్ఆర్సీపీ భయపడుతున్నట్లు ఉంది. రాజకీయాల్లో వివిధ పార్టీలు పొత్తులు పెట్టుకోవడమన్నది సర్వసాధారణం. అంతిమంగా ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోయారన్నదే ఎన్నికల్లో ప్రధానం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అనే లక్ష్యంతో జనసేన`టీడీపీ పొత్తుకు సిద్ధమైతే, అది నేరం అన్నట్లు గతంలో ఎవరూ పొత్తు పెట్టుకోనట్టు వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.