తాడేపల్లిగూడెం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సారథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ధార్మిక పరిషత్తు నిర్వహణలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోజరుగుతున్న ధర్మ ప్రచార మహోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామి వార్లు, అమ్మవార్లు భక్తులకు కళ్యాణమూర్తులుగాదివ్య దర్శనం ఇచ్చారు. ప్రఖ్యాత వేద పండితులు వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం నుంచి వచ్చిన వేద పండితులు అర్చక స్వాములు అక్కడ ఆలయంలో ఏ రీతిన స్వామి వారి కళ్యాణంనిర్వహిస్తారో అదే రీతిన ఇక్కడ తాడేపల్లిగూడెం ధర్మ ప్రచార మహోత్సవాలలోనూ స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అత్యంత కనుల పండుగగా అంగరంగ వైభవంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిదివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. చూడడానికి రెండు కళ్ళు చాలనంతగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వార్ల కళ్యాణ వైభోగం కనువిందు చేసింది. మంత్రి కొట్టు సత్యనారాయణ సతీమణి సౌధనీకుమారి,తనయుడు, యూత్ లీడర్ కొట్టు విశాల్, సిజిఎఫ్ కమిటీ మెంబర్ కర్రి భాస్కరరావు, బలుసులమ్మ గుడి దేవస్థానం చైర్మన్ కొట్టు అంజిబాబు, వట్టిప్రోలు రాము, గార్లపాటి వీరకుమార్, అప్పన రమేష్, పెదప్రోలు వెంకటభాస్కరాచార్యులు, నున్న శ్రీ రంగనాయకులు, స్వామి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఈ కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు దేవస్థానం నుండి తీసుకువచ్చిన తీర్థప్రసాదాలను, స్వామివారి కళ్యాణం తలంబ్రాలను అందజేశారు.