ఏపీలో పిచ్చోడి చేతికి అధికారం ఇచ్చారు
అన్నీ వ్యవస్థలను భ్రష్టుపట్టించారు
నిప్పులు చెరిగిన చంద్ర బాబు
విశాఖపట్నం ఫిబ్రవరి 5: ఏపీలో పిచ్చోడి చేతికి అధికారం ఇచ్చారని.. ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం నాడు ఏలూరులోని చింతలపూడి సభలో ‘‘రా.. కదలిరా’’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభకు కార్యకర్తలు, నేతలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… జగన్‌ను భరించే స్థితిలో ప్రజలు లేరన్నారు. మళ్లీ ఇటుక.. ఇటుక పేర్చుకుని రాష్ట్రాన్ని నిర్మించుకుందామని తెలిపారు. మందుబాబుల దగ్గర జలగలాగా జగన్ పైసలను దోచేస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్షల కోట్లు దోచేశారు
వైసీపీ నేతలు రూ.లక్షల కోట్లు దోచేశారని మండిపడ్డారు. జగన్ అర్జునుడు కాదు.. అక్రమార్జునుడని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో ఇంత అక్రమార్జునుడిని చూడలేదని చెప్పారు. కలియుగంలో జగన్ బకాసురుడని మొత్తం మింగేస్తున్నారన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచారని ధ్వజమెత్తారు. రూ.64 వేల కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి ఇక 64 రోజులే గడువుందని.. ఆ పార్టీ ఇంటికి వెళ్లడం ఖాయమని.. టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. యువత ఎటువైపు ఉంటే.. అటువైపే గెలుపు ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికలు టీడీపీ ` జనసేన కూటమికి కాదని.. రాష్ట్ర భవిష్యత్ కోసం జరిగే ఎన్నికలని చెప్పారు. ఈ ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి అవసరమని తెలిపారు.
జగన్ అన్నీ వ్యవస్థలను భ్రష్టుపట్టించారు
జగన్ ధనదాహంతో ఉన్నారని మండిపడ్డారు. జగన్‌కు ఉత్తరాంధ్ర విూద ప్రేమ లేదని.. కేవలం భూముల విూద మాత్రమే ప్రేమ ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్‌ను అమలు చేస్తామన్నారు. వైసీపీ సిద్ధమంటూనే సందిగ్ధంలో పడిపోయిందన్నారు. ‘‘సిద్ధం’’ లేదు, బూడిద లేదన్నారు. జగన్ పాలన వల్ల నిలిచి పోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఏపీ భవిష్యత్తు కోసం తెలుగుదేశాన్ని గెలిపించాలని… సీఎం జగన్ అన్నీ వ్యవస్థలను భ్రష్టుపట్టించారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.