విజయవాడ, ఫిబ్రవరి 5:ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. శాసనమండలి, శాసనసభను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పని చేస్తోందని అన్నారు. ‘బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సంక్షేమ పథకాల అమలుతో అన్ని వర్గాలు లబ్ధి పొందాయి. పేదరిక 11.25 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గింది. విద్యా రంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు చేశాం. మన బడి, నాడు ` నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు తెచ్చాం. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ఇందు కోసం రూ.4,417 కోట్లు ఖర్చు చేశాం. అమ్మఒడి ద్వారా 83 వేల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. జగనన్న విద్యా కానుక కోసం ఇప్పటివరకూ రూ.3,367 కోట్లు ఖర్చు చేశాం. డిజిటల్ లెర్నింగ్ లో భాగంగా 8, 9 తరగతుల విద్యార్థులకు 9,52925 ట్యాబ్స్ పంపిణీ చేశాం. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ విధానం ప్రవేశపెడతాం. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా విద్యా బోధన ఉంటుంది.’ అని గవర్నర్ తెలిపారు.’రాష్ట్రంలో 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్స్, 1,142 పీహెచ్సీలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. నాడు ` నేడు ద్వారా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఇప్పటివరకూ 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించాం. ఇప్పటివరకూ 1.3 కోట్ల గ్రావిూణ రోగులకు ఇంటి వద్దే సేవలందించాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా జగనన్న ఆరోగ్య సురక్షను అమలు చేస్తున్నాం.’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. అలాగే, రైతులు రాష్ట్రానికి వెన్నెముక అని.. రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 53.53 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రూ.33 వేల కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని అన్నారు.రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిందని గవర్నర్ నజీర్ అన్నారు. ‘రూ.50.30 కోట్లతో 35 ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేశాం. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రతీ కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో 30 శాతం వాటాతో ఏపీ మొదటి స్థానంలో ఉంది. వేటకు వెళ్లి మత్స్యకారులు చనిపోతే రూ.10 లక్షల పరిహారం ఇస్తున్నాం.’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వం మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని గవర్నర్ తెలిపారు. ‘వైఎస్సార్ ఆసరా ద్వారా 78.84 లక్షల మంది మహిళలకు రూ.25,571 కోట్లు అందించాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 6.4 లక్షల మంది గర్భిణీలు, 28.62 లక్షల మంది పిల్లలకు లబ్ధి కలుగుతోంది. వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా 66.43 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం.’ అని చెప్పారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు పుర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని.. ఇప్పటివరకూ 74.01 శాతం పనులు పూర్తౌెనట్లు చెప్పారు. అవుకు ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పూర్తి చేశామని పేర్కొన్నారు. పులిచింతల నిర్వాసితులకు రూ.142 కోట్లు చెల్లించినట్లు వివరించారు.రాష్ట్రంలో ఐటీ, విమానయాన, పర్యాటక రంగంలో వృద్ధి సాధించామని గవర్నర్ తెలిపారు. మరో 30 నెలల్లో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ‘ఐటీ రంగాన్ని ప్రోత్సహించేలా ఐటీ పాలసీ ప్రవేశపెట్టాం. 200 ఎడబ్ల్యూ డేటా సెంటర్ కోసం రూ.14,694 కోట్లు పెట్టుబడి. మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేశాం. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తెచ్చాం. 7,290 మందికి ఉపాధి కల్పించేలా రూ.3,685 కోట్ల పెట్టుబడితో చర్యలు చేపట్టాం.’ అని వివరించారు.విజయవాడలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగిందని.. ఇది అభినందనీయమని గవర్నర్ అన్నారు. 18.8 ఎకరాల్లో 206 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రూ.404.35 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. దీని ఏర్పాటుపై సీఎం జగన్, రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నామని అన్నారు. చివరగా.. బాపూజీ మాటలతో గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు.