గుంటూరు, డిసెంబర్‌ 19: రాజకీయాల్లో శాశ్వత శతృత్వం ఉండదంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అది మరింతగా తేటతెల్లమైన విషయమే. పాతమిత్రుల కలయికతో మరోసారి ఏపీ రాజకీయాలు రసవత్తరం కాబోతున్నాయన్న ఊహాగానాలు అన్ని పార్టీల్లో కొత్త చర్చలకు తెరలేపాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన రెండూ కమలంతో కలిసి నడవగా.. ఐదేళ్లలో టీడీపీ కాంగ్రెస్‌ గూటికి చేరి వైరిపక్షంగా మారింది. క్రమంగా జనసేన, టీడీపీ మధ్య కూడా అంతరం పెరిగింది. చంద్రబాబు అరెస్టు అనంతరం ఇటీవలే మళ్లీ సైకిలెక్కిన జనసేనాని బీజేపీతో తమ ప్రయాణంపై ఎటూ చెప్పలేదు. మొత్తానికి రెండోసారి కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఏర్పాటైన తర్వాత వేర్వేరు మార్గాల్లో నడుస్తూ మధ్యలో కలిసిన ఈ ఇద్దరు మిత్రులూ గతంలో తమ ఉమ్మడి స్నేహపక్షమైన కమల శిబిరంలో తిరిగి చేరాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికలనే కూడలిలో ముగ్గురు పాత మిత్రులూ కలిసి కూటమిగా ప్రత్యర్థులతో తలపడబోతున్నారన్న వార్తలు ఇంటా బయటా షికారు చేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర, జాతీయ అధిష్టానాల ధోరణి కూడా ఆ ప్రచారానికి ఆజ్యం పోస్తోంది.ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ పట్టు నిలుపుకునే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలోనూ ప్రస్తుతం అధికారంలో లేని కమలం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను పరోక్షంగా శాసించాలని భావిస్తున్నట్టు దాదాపు స్పష్టమవుతున్నది. ఈ మేరకు పొత్తులపై బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి రహస్య సంకేతాలు అందినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. బీజేపీ అధినాయకత్వం ఆశిస్సులున్నవారే ఏపీలో అధికారంలోకి వస్తారని కూడా గత అనుభవాల దృష్ట్యా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ, షా, నడ్డా త్రయం ఆంధ్రప్రదేశ్‌?లో టీడీపీ, జనసేనలతో పొత్తు దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. పార్టీ కేడర్‌?ను ఈ దిశగా సమాయత్తం చేయాలని రాష్ట్ర నాయకులకు కేంద్ర పెద్దలు సూచించారట. కార్యకర్తలను ఇందుకోసం సిద్ధం చేయాలని అమిత్‌ షా సూచించారని తెలుస్తోంది. అయితే, పొత్తును అధికారికంగా వెల్లడిరచడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయిగతంలో ఏపీలో టీడీపీతో పొత్తుతో బీజేపీ రెండు మంత్రి పదవులు చేపట్టిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా ఈసారి జనసేనకు 35 సీట్లు, బీజేపీ 15 సీట్లు డిమాండ్‌ చేస్తున్నాయనిÑ అయితే జనసేనకు 20, కమలం పార్టీకి 5 సీట్ల వరకూ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ పరిణామాల నేపథ్యంలో పొత్తు వార్తలు ఎంతవరకూ నిజమవుతాయో.. ఒకవేళ నిజమైతే, ఏపీలో ఆయా పార్టీల కార్యకర్తలను ఏ మేరకు సంతృప్తి పరుస్తాయో, రాష్ట్ర రాజకీయాలను ఏ మేరకు శాసిస్తాయో వేచిచూడాల్సిందే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *