తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్‌ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్‌ ను పరిగణిస్తారు.ఉద్యోగ రీత్యా భారత దేశానికి వచ్చిన ఈ విదేశీయుడు తెలుగు వాక్యాన్ని ఆంగ్లం కబళిస్తున్న ఆ రోజుల్లోనే తెలుగు నేర్చుకున్నారు. కనుమరుగయ్యే స్థితిలో ఉన్న తెలుగుని పునః ప్రతిష్ట చేశాను అని ఆయనే చెప్పుకున్నాడు కూడా.మద్రాసులో ఉద్యోగం చేసే సమయంలో తెలుగు మాట్లాడటం తప్పని సరి అయ్యింది. నాడు తెలుగు నేర్చుకోవటానికి సరైన విధానాలు, పద్ధతులు లేనందున పండితుల వద్ద స్వయంగా తెలుగులో శిక్షణ పొందాడు.అంతేకాదు, తెలుగులో పాండిత్యాన్ని సంపాదించి, తెలుగు నిఘంటువుతో సహా అనేక రచనలు చేశాడు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.బ్రౌన్‌ తెలుగు భాషాభిమానే కాకుండా మానవతావాది కూడా. తన సొంత ఆదాయంతో కడప, మచిలీపట్నం ప్రాంతాలలో పాఠశాలలను నిర్మించాడు. పండితులకు, విద్వాంసులకు జీత భత్యాలు కూడా తానే స్వయంగా చెల్లించే వాడు. ఆ కారణంగా అప్పుల పాలు కూడా అయ్యాడు. తర్వాత ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు.వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు. నలచరిత్ర, ఆంధ్రమహాభారతం, శ్రీమద్‌ భాగవతం లను ప్రచురించాడు. అవే కాకుండా పలు గ్రంథాలకు తెలుగు మరియు ఆంగ్ల భాష లో ప్రచురణ భాగ్యం కల్పించాడు.వేమన, సుమతి శతకాలతో పాటుగా పల్నాటి యుద్ధం లాంటి చారిత్రిక కావ్యాలను నన్నయ్య, తిక్కన, గౌరన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామరాజ భూషణుల కృతుల పరిష్కరణ ` ప్రచురణల ముద్రింపచేసాడు.లండన్‌ విశ్వవిద్యాలయంలో తెలుగు కోర్సును కూడా ప్రారంభించాడు. కడపలో భవనం నిర్మించుకుని సాహితీ వ్యాసంగాన్ని ఏర్పాటు చేశాడు. విరివిగా దానధర్మాలు చేసేవాడు.తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వ్యాకరణ గ్రంధాలు రచించారు. ‘‘ఆంధ్ర గీర్వాణ ఛందము’’ అనే పుస్తకం తామే స్వయంగా రచించాడు. నాటి తెలుగు కవులు, సాహిత్య విమర్శకులు అందరి అభినందనలను , ప్రశంశలను అందుకున్నాడు . తెలుగు భాషకు ఇంత సేవ చేశాడు కనుకనే బ్రౌన్‌ విదేశీయుడు అయినా, ఆంధ్రుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో బ్రౌన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని పోటీలు నిర్వహిస్తున్నారు.తెలుగు భాష గొప్పతనం తెలియాలి అంటే తెలుగు రచనలు చదవాలి, తెలుగు సంస్కృతి గురించి తెలియాలి. ఎందరో మహానుభావులు ఎంతో శోధించి, సాధించి మనకోసం ఎన్నో గ్రంధాలు, పురాణాలు, పుస్తకాలు, కావ్యాలు రచించారు మన తెలుగు వారి కోసం. అలాంటి మన తెలుగు నీ మనమే కాదనుకుని పరిస్థితి వచ్చింది. మన తెలుగుని మనమే కాపాడుకుందాం. రండి మనం అందరం ముందడుగు వేద్దాం…జై తెలుగు తల్లి! జీవిత విశేషాలు ..సి.పి.బ్రౌన్‌ 1798 నవంబర్‌ 10న కలకత్తాలో జన్మించాడు. ఈయన తండ్రి డేవిడ్‌ బ్రౌన్‌ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగష్టు 4 న మద్రాసు లో ఈస్ట్‌ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాధమిక జ్ఞానాన్ని సంపాదించాడు.1820 ఆగష్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడం లోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826 లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. బ్రౌను మానవతావాది. 1832`33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్‌ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్‌ 1884 డిసెంబర్‌ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్‌, వెస్ట్‌బార్న్‌ గ్రోవ్‌, లండన్‌ లో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్‌ గ్రీన్‌ స్మశానంలో సమాధి చేశారు. బ్రౌన్‌ స్మృతి చిహ్నంగా, కడపలో ఆయన నివసించిన బంగళా స్థలంలో ప్రభుత్వము, ప్రజలు సంయుక్తంగా గ్రంథాలయాన్ని నిర్మించారు. వివిధ సంస్థలు, వ్యక్తులు గ్రంథాలను విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఇది భాషా,సాహిత్య పరిశోధనా కేంద్రంగా ద్రవిడ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పని చేస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *