రెండేళ్లుగా పేద, మధ్య తరగతి వర్గాలను ఎవర్ని కదిలించినా, పది మాటల్లో కనీసం రెండు మూడైనా పెరిగిన ధరల గురించే ఉంటున్నాయి. పెట్రోల్, వంట నూనె, కరెంట్ బిల్, పాల ప్యాకెట్.. వస్తువు ఏదైనా పెరుగుదల అనే పాయింట్ మాత్రం కామన్. తినడమూ, ఖర్చు పెట్టడమూ మానలేము. మన దేశంలో సామాన్యుడి భోజనం బిల్లు మళ్లీ పెరిగింది, ముద్ద మింగుడు పడడం లేదు. పెరుగుతున్న కూరగాయల రేట్లతో ఇటు శాఖాహారం, అటు మాంసాహారం రెండిటి బడ్జెట్ మారింది. నాన్`వెజ్ వండాలంటే టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, మిర్చి, కొత్తివిూర వంటి వెజిటేరియన్ పదార్థాలు ఉండాలి. కాబట్టి, మాంసాహారం కోసం చేసే ఖర్చు కూడా పెరిగింది.క్రిసిల్ రోటీ రైస్ రేట్ ఇండెక్స్ ప్రకారం, గత నెలలో టమాటాలు, ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగాయి. ద్రవ్యోల్బణం లాంటి పెద్ద పెద్ద మాటలు వాడకుండా, ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలి దగ్గర కూర్చుని ధరల పెరుగుదల ఆమెను ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేశాం. రాజకీయ నాయకులు తరచూ మాట్లాడే, ధర్నాలు చేసే, గ్యాస్ సిలిండర్లు నెత్తిన పెట్టుకుని, ఎడ్ల బండిపై వెళుతూ చేసే ప్రదర్శనలన్నీ ఒకవైపు.. ఆర్టీసీ బస్సులో కూర్చునో, బైక్ పై వెళ్తూనో, షేర్ ఆటోలో నుంచి తొంగి చూసి ఆ ఆందోళనకు కారణం తెలుసుకుని నిట్టూర్చే మధ్య తరగతి, పేదలు మరోవైపు.క్రిసిల్ రీసెర్చ్ డేటాను బట్టి, గత నెలలో, ఇంట్లో వండే శాఖాహార వంటల బడ్జెట్ 10% పెరిగింది. అదే సమయంలో మాంసాహారం కోసం చేసే ఖర్చు 5% పెరిగింది. విడివిడిగా చూస్తే… నవంబర్ నెలలో ఉల్లిపాయల రేట్లు 93% పెరిగాయి, టొమాటో ధరలు 15% పెరిగాయి. ధరాఘాతం వల్ల… రోటీ, అన్నం, పప్పు, కూర, పెరుగుతో కూడిన సాధారణ శాఖాహార భోజనం తయారీ ఖర్చు గత సంవత్సరం నవంబర్ నెల కంటే ఈ సంవత్సరం నవంబర్ నెలలో 9% పెరిగింది. పప్పులది వెజ్ థాలీ ధరలో 9% వాటా. వీటి రేటు కూడా గత సంవత్సరం కంటే ఇప్పుడు 21% పెరిగాయి, భోజనం భారాన్ని పెంచాయి.నాన్`వెజ్ భోజనం తయారీ ఖర్చుది కూడా ఇదే పంథా. రోటీ, అన్నం, పప్పు బదులు చికెన్ (బ్రాయిలర్), పెరుగుతో కూడిన సాధారణ మాంసాహార భోజనం ఖర్చు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగింది. అయితే, బ్రాయిలర్ చికెన్ రేట్లు తగ్గడం వల్ల, ఓవరాల్ రేటులో 5% పెరుగుదల మాత్రమే కనిపిస్తోంది. నాన్`వెజ్ థాలీ ధరలో బ్రాయిలర్ వాటా 50% ఉంటుంది. అందువల్లే, కూరగాయల రేట్లు పెరిగినా మాంసాహార ప్రియులకు ఉపశమనం దొరికింది. ఉల్లి, టమాటా ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు రెండు. పండుగల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడం, సరైన వర్షాలు లేక ఖరీఫ్ సీజన్‌లో ఉత్పత్తి తగ్గడం. ఈ ఏడాది జనవరి`మే కాలంలో ఉల్లి, టొమాటోల రేట్లు తగ్గాయి, జులై`ఆగస్టులో పెరిగాయి. ఆగస్టు నెలలో టమాటా రేట్లు చుక్కల్లోకి చేరాయి, సామాన్య జనానికి పట్టపగలే చుక్కులు చూపించాయి. టమాటా రేట్ల వల్ల ఆ నెలలో శాఖాహార భోజనం తయారీ ఖర్చు 24% పెరిగింది. అదే సమయంలో మాంసాహార భోజనం తయారీ ఖర్చు 13% పెరిగింది. ధరలు అంటే ఫస్ట్ చెప్పాల్సింది ఆయిల్. ఆయిల్ రేట్ 2019 ప్రాంతంలో 90 రూపాయలు సుమారుగా ఉండేది. తరువాత 120 అయింది. ఇప్పుడు 220 వరకూ పెరిగింది. అది మామూలు పెరుగుదల కాదు. అసలు వంట నూనె ఇంత భారీగా పెరగడం మాటలు కాదు. మూడేళ్ల క్రితం 75`80 రూపాయలు ఉండేది పెట్రోలు. ఇప్పుడు 110 అయింది. వాస్తవానికి 120 అయితే, మొన్నామధ్య పెంచి మళ్లీ 10 రూపాయలు తగ్గించారు కదా. అంటే ఏకంగా మూడేళ్లలో 30 రూపాయల పైన పెట్రోల్ పెరిగింది.